అమిత్ షా తో పవన్ కళ్యాణ్ కీలక భేటీ

ఢిల్లీలో మంగళవారం జరిగిన ఎన్డీయే సమావేశంకు హాజరైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల గురించి ఆ సమావేశంలో చర్చించేందుకు ఎక్కువగా అవకాశం లేకపోవడంతో బుధవారం బీజేపీ కీలక నేతలతో భేటీలు జరిపారు. సాయంత్రం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసి ఎన్నికల వ్యూహం గురించి, ఏపీలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితుల గురించి చర్చలు జరిపారు.
 
అంతకు ముందు ఉదయం పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్ తో కలిసి  కేంద్ర మంత్రి, బీజేపీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి వి. మురళీధరన్‌ను ఆయన నివాసంలో కలిసి అల్పాహార విందు, భేటీ జరిపారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం, జనసేనతో పొత్తులపై చర్చించినట్లు మురళీధరన్‌ ట్వీట్‌ చేశారు.  పవన్‌, మనోహర్‌కు ఆతిథ్యం ఇవ్వటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు
 
రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు చీలకుండా చూడాలని మరోసారి బిజెపి నేతలకు పవన్ కళ్యాణ్ చెప్పినట్లు తెలిసింది.  రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, జగన్‌ వ్యవహారంపై మంతనాలు సాగించినట్లు తెలిసింది. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఓటమికి అన్ని శక్తులు ఏకం కావాలన్నదే తమ లక్ష్యమని, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తాయని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
 
భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ ట్వీట్ ద్వారా అమిత్ షాను కలిసిన ఫొటోలను విడుదల చేశారు. అలాగే ఈ భేటీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉజ్వల భవిష్యత్తును నిర్దేశించే నిర్మాణాత్మకంగా, నిర్ణయాత్మకంగా జరిగిందని ట్వీట్‌లో పేర్కొన్నారు.   అమిత్‌ షాతో సమావేశం అద్భుతంగా జరిగిందన్న పవన్‌ కళ్యాణ్.. తమ చర్చలు రాష్ట్ర ప్రజల ప్రగతికి దోహదం చేస్తాయని ట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక సుసంపన్నమైన భవిష్యత్‌ అందించేందుకు ఈ చర్చలు దోహదపడతాయని పేర్కొన్నారు.

మరోవంక, వైఎస్సార్సీపీ తిరుగుబాటు నేత రఘురామకృష్ణ రాజు సహా మరికొందరు ఢిల్లీలోని ప్రముఖులు పవన్ కళ్యాణ్‌ను ఢిల్లీలో కలిశారు. గురువారం కూడా ఆయన మరోకొంతమంది నేతలను ఢిల్లీలో కలిసే అవకాశం ఉంది.