విపక్ష కూటమి కొత్త పేరు ‘ఇండియా’

విపక్ష కూటమి కొత్త పేరు ‘ఇండియా’
2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఏన్డీఏను ఐక్యంగా, సమర్ధవంతంగా ఎదుర్కోవడం కోసం విపక్ష పార్టీలు ఏర్పాటు చేసుకున్న కూటమి పేరును ‘ఇండియా’ గా నిర్ధారించినట్లు సమాచారం. ‘ఇండియా’ అంటే ఇండియన్ నేషనల్ డెమొక్రాటిక్ ఇన్ క్లూజివ్ అలయన్స్. తమ కూటమికి `ఇండియా’ అని నామకరణం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే సమావేశం ముగింపులో ప్రకటించారు.

కాంగ్రెస్ నాయకత్వంలో 2004 లో యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ (యుపిఎ) ఏర్పడింది. ఈ కూటమి రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. తాజాగా, అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేను ఎదుర్కోవడం కోసం రూపు దిద్దుకుంటున్న విపక్ష కూటమికి ఇండియా అనే పేరు పెట్టారు. తమ తదుపరి సమావేశం ముంబైలో ఉంటుందని ఖర్గే తెలిపారు.

‘విపక్ష కూటమి భారత్ ను ప్రతిబింబిస్తుంది. అందుకే ఇండియా అనే పేరు కూటమికి సరిగ్గా సరిపోతుంది. ఈ పేరు కూడా బీజేపీ ని బాధ పెడుతుంది’ అని ఆర్జేడీ ఒక ట్విటర్ పోస్ట్ లో పేర్కొంది.   ‘‘2024 ఎన్నికలు టీమ్ ఇండియా కు టీమ్ ఎన్డీయే మధ్య జరగబోతున్నాయి’’ అని శివసేన ఉద్ధవ్ వర్గం నేత ప్రియాంక చతుర్వేది వ్యాఖ్యానించారు. దానికి స్పందనగా చక్ దే ఇండియా అంటూ టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ బ్రీన్ ట్వీట్ చేశారు. ‘ఇండియా గెలవబోతోంది’ అని లోక్ సభ ఎంపీ మానికం టాగోర్ ట్వీట్ చేశారు.

ఇలా ఉండగా, కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారంపైకాని, ప్రధాని పదవిపై కాని ఆసక్తి లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం ప్రకటించారు. బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశం రెండవ రోజున ప్రారంభోపన్యాసం చేస్తూ ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం అధికారాన్ని చేజిక్కించుకోవడం కాదని తెలిపారు.

మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని పరిరక్షించుకోవడమేనని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీల మధ్య రష్ట్ర స్థాయిలో విభేదాలు ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ అవి సిద్ధాంతపరమైనవి కావని ఆయన చెప్పారు. తాము పాట్నాలో మొదటి సమావేశం ఏర్పాటు చేసినప్పుడు తమ కూటమిలో 16 పార్టీలు ఉన్నాయని, ఇప్పుడు బెంగళూరులో 26 పార్టీలు వచ్చాయన్నారు.

బెంగళూరు సమావేశాలలో కాంగ్రెస్‌తోపాటు టిఎంసి, డిఎంకె, ఆప్, జెడియు, ఆర్‌జెడి, జెఎంఎం, ఎన్‌సిపి(శరద్ పవార్ గ్రూపు), శివసేన(ఉద్ధవ్ థాక్రే గ్రూపు), సమాజ్‌వాది పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్, అప్నా దళ్, నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపి, సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్(లిబరేషన్), ఆర్‌ఎస్‌పి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఎండిఎంకె, విసికె, కెఎండికె, ఎంఎంకె, ఐయుఎంఎల్, కేరళ కాంగ్రెస్(ఎం), కేరళ కాంగ్రెస్(జోసెఫ్) పాల్గొంటున్నాయి.