రాజ్యసభకు జైశంకర్‌ సహా 10 మంది ఏకగ్రీవం

రాజ్యసభకు జైశంకర్‌ సహా 10 మంది ఏకగ్రీవం
పలు రాష్ట్రాల్లో రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేయగా షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 24న ఎన్నికలు జరుగాల్సి ఉంది. బెంగాల్‌లో ఆరు, గుజరాత్‌లో మూడు, గోవాలోని ఒక స్థానానికి నోటీఫికేషన్‌ వెలువడిన విషయం విధితమే. అయితే, ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవం కానున్నారు. 
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత డెరెక్‌ ఓబ్రెయిన్‌ రాజ్యసభకు ఎన్నికవనున్నారు.  ఆయా అభ్యర్థులకు పోటీగా ఎవరూ నామినేషన్‌ వేయకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. నేటి ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. గుజరాత్‌ నుంచి జైశంకర్‌తో పాటు బాబు దేశాయ్, దేవ్‌సింగ్ జాలా పోటీలో ఉన్నారు. 

బెంగాల్‌ నుంచి డెరెక్ ఓబ్రెయిన్, డోలా సేన్, సుఖేందు శేఖర్ రే, సమీరుల్ ఇస్లాం, ప్రకాశ్‌ చిక్ బరాక్, సాకేత్ గోఖలే బరిలో ఉండగా, గోవా నుంచి సదానంద్ షెట్ తనవాడే బరిలో నిలువగా వీరి ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. ఇదిలా ఉండగా, జులై 24 తర్వాత 245 మంది సభ్యులున్న రాజ్యసభలో మరో ఏడు సీట్లు ఖాళీ కానున్నాయి.

ఇందులో జమ్మూకశ్మీర్‌ నుంచి నాలుగు, ఉత్తరప్రదేశ్‌లో రెండు నామినేటెడ్‌తో పాటు మరో సీటు ఖాళీ కానుండగా  రాజ్యసభలో సభ్యుల బలం 238కి తగ్గనున్నది. అయితే, రాజ్యసభలో మెజారిటీ మార్క్‌ 120 కానుండగా బీజేపీ, మిత్రపక్షాలు కలుపుకొని ప్రభుత్వానికి 105 సభ్యుల మద్దతు ఉంటుంది. ఐదుగురు నామినేటెడ్‌, ఇద్దరు స్వతంత్ర ఎంపీల మద్దతు బీజేపీ ఉండడంతో బలం 112కి చేరనున్నది. మెజారిటీ కంటే ఎనిమిది సీట్లు తక్కువ కానున్నాయి.