`సుప్రీం’ న్యాయమూర్తులుగా జస్టిస్‌లు ఉజ్జల్ భూయాన్, ఎస్వీ భట్టి

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌లు ఉజ్జల్ భూయాన్, ఎస్వీ భట్టిలను నియమించాలన్న కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో సంప్రదించిన తర్వాత వారిద్దరినీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించారు. 
ఈ సంగతిని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ట్వీట్ ద్వారా తెలిపారు. 
‘భారత రాజ్యాంగం కల్పించిన అధికారాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంప్రదించిన తర్వాత జస్టిస్ భూయాన్, జస్టిస్ భట్టిలను దేశ అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తులుగా నియమించారు’ అని ట్వీట్ చేశారు.  వీరిద్దరి పేర్లను ఈ నెల ఐదో తేదీన సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది.
ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పని చేస్తున్నారు. జస్టిస్ ఎస్వీ భట్టి కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా సేవలందిస్తున్నారు. తాజా కేంద్రం నిర్ణయంతో తెలంగాణ, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పదోన్నతి లభించింది. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 2011 అక్టోబర్ 17న గువాహటి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు అయ్యారు. నాటి నుంచి గతేడాది జూన్ 28న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే వరకూ గువాహటి హైకోర్టు జస్టిస్ గా పని చేశారు.

జస్టిస్ ఎస్వీ భట్టి 2013 ఏప్రిల్ 12న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. నాటి నుంచి 2019 మార్చిలో కేరళ హైకోర్టుకు బదిలీ అయ్యే వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే పని చేశారు. గత నెల ఒకటో తేదీ నుంచి కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్నారు.

గతేడాది ఆగస్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో ఎటువంటి ప్రాతినిధ్యం లేదని సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానం పేర్కొంది. సుప్రీంకోర్టుకు 34 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 30 మంది మాత్రమే పని చేస్తున్నారు. తాజాగా మరో ఇద్దరి నియామకంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరనున్నది.