ఒడిదొడుకులు ఉన్నా వర్షాలు కురుస్తాయి … భవిష్యవాణి

ఒడిదొడుకులు ఉన్నా వర్షాలు కురుస్తాయి … భవిష్యవాణి
ఈసారి ఒడిదొడుకులు ఉన్నా వర్షాలు కురుస్తాయని,  అగ్ని ప్రమాదాలు జరుగుతాయని జాగ్రత్తగా ఉండాలని అమ్మవారి భక్తురాలైన మాతంగి స్వర్ణలత భవిష్యవాణిలో చెప్పారు. సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతరలో రెండో రోజైన సోమవారం ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారు భవిష్యవాణి వినిపిస్తూ  గతేడాది ఇచ్చిన వాగ్ధానాలు మరిచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బోనాల ఉత్సవాల్లో ప్రజల పూజలు సంతోషంగా అందుకున్నానని చెప్పారు. గతేడాది తనకు ఇచ్చిన వాగ్దానం మరిచిపోయారన్నారు. కావాల్సిన బలాన్నిచ్చానని.. మీ వెంటా ఉంటానని చెప్పారు.ఈ ఏడాది ఆలస్యమైనా వర్షాలు తప్పకుండా వస్తాయని తెలిపారు.

“ఎలాంటి లోపాలు లేకుండా పూజలు జరిపించినందుకు సంతోషం. కానీ గతేదాది ఇచ్చిన వాగ్ధానాలు మరిచిపోయారు. కావాల్సినంత బలాన్ని ఇచ్చాను. మీతోనే ఉంటాను. వర్షాలు తప్పకుండా వస్తాయి కానీ.. ఒడిదొడుకులు ఉంటాయి. అగ్ని ప్రమాద లు కూడా జరగుతాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. నా వద్దకు వచ్చిన ప్రజలందరిని కాపాడుకుంటా. ఎటువంటి లోపాలు లేకుండా చూసుకుంటా. నాకు ఐదు వారాల పాటు సాక పట్టండి. గడప గడపను కాపాడే బాధ్యత నాది. మీరు చేసిన క్రియలు, పూజలు నాకు తెలుసు. ఏది బయపెట్టాలో.. ఏది బయటపెట్టకూడదో నాకు మాత్రమే తెలుసు. మీరు ఏ పూజలు చేసినా.. సంతోషంగా, ఆనందంగా అందుకుంటున్నా. మీరు మాత్రం మర్చిపోకండి. వచ్చే ఏడాదికి ఇచ్చిన వాగ్ధానాలు పూర్తి చేయండి.” అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.

 ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా హాజరయ్యారు. భవిష్యవాణి వినేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. రంగం కార్యక్రమం నేపథ్యంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనం నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు. భవిష్యవాణి వినేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

మరోవైపు సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగింది. సీఎం కేసీఆర్‌ దంపతులతో పాటు వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక, తొట్టెలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం ఉదయం 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబసభ్యులతో కలిసి దేవాలయానికి వచ్చారు. ఆయన సతీమణి స్వర్ణ అమ్మవారికి బోనం సమర్పించారు.

హరియాణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎంపీ కె.కేశవరావు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, దానం నాగేందర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కె.కవిత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీలు వి.హన్మంతరావు, అంజన్‌కుమార్‌ యాదవ్ అమ్మవారిని దర్శించుకున్నారు.