తిరుమలలో మరో అపచారం, కిందపడిపోయిన హుండీ కానుకలు!

తిరుమలలో మరో అపచారం చోటుచేసుకుంది. శ్రీవారి ఆలయం ముఖద్వారం ముందు హుండీ పడిపోయింది. భక్తులు కానుకలు వేసిన హుండీ పరకామణికి ట్రాలీపై తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. టీటీడీ సిబ్బంది హుండీని తరలిస్తుండగా ఒక్కసారిగా పక్కకు ఒరిగి పడిపోయింది.  దీంతో హుండీలోని కానుకలు కిందపడిపోయాయి.
వెంటనే అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది కానుకలను హుండీలో వేశారు. ఆ హుండీని ట్రాలీ ఎక్కించి పరకామణికి తరలించారు. శ్రీవారిని దర్శించుకున్నాక భక్తులు తమకు తోచిన కానుకలను హుండీలో వేసి మొక్కులు తీర్చుకుంటారు. డబ్బు రూపంలో, బంగారం రూపంలో భక్తులు కానులు సమర్పించుకుంటారు. 
 
నిత్యం శ్రీవారికి హుండీ ద్వారా కోట్లలో ఆదాయం వస్తుంది. శ్రీవారి కానుకలు సమర్పించడాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తుంటారు. అలాంటి హుండీ శ్రీవారి ముఖద్వారం వద్ద కింద పడిపోవడంపై భక్తులు ఏం జరుగుతోందో అని ఆందోళన చెందుతున్నారు.  సీల్ వేసిన హుండీ నుంచి కానుకలు నేలపై పడిపోవడంతో భక్తులు ఆందోళన చెందారు.
 
తాము ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీనివాసుడికి సమర్పించిన కానుకలు నేలపాలు చేశారని ఒకింత ఆగ్రహానికి లోనైయ్యారు. కింద పడిపోయిన కానుకలను టీటీడీ సిబ్బంది జాగ్రత్తగా సేకరించి అధికారులకు అప్పగించారు. శ్రీవారికి సమర్పించిన కానుకలు నేలపై పడడం అపచారం అంటూ భక్తులు లెంపలు వేసుకుంటున్నారు.

తిరుమలలో శునకం హల్ చల్

కాగా, తిరుమలలో తరచూ సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తుండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో ఇటీవల శునకం హల్ చల్ చేసింది. శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చిన కర్ణాటక భక్తులు తమ వాహనంలో వారి పెంపుడు కుక్కను తిరుమలకు తీసుకువచ్చారు. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే శునకాన్ని తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

తిరుమలలో వన్య మృగాల సంచారం కారణంగా కొండపైకి శునకాలను తీసుకురావడాన్ని టీటీడీ నిషేధించింది. స్థానికులు ఉంటే బాలాజీనగర్ లో కూడా శునకాలను పెంచడాన్ని టీటీడీ నిషేధించింది. అయితే కర్ణాటకకు చెందిన భక్తులు తమ వాహనంలో కుక్కని తీసుకువచ్చారు. భద్రతా సిబ్బంది పట్టించుకోక పోవడంతోనే భక్తులు కొండపైకి శునకాన్ని తీసుకువచ్చారని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. భక్తులు కుక్కను వాహనంలో ఉంచుకుని కొండపై చక్కర్లు కొడుతుండగా తీసిన వీడియో వైరల్ అయింది.