అక్రమాస్తుల కేసులో జగన్‌ సంస్థలకు సుప్రీంకోర్టు నోటీసులు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికు సుప్రీంకోర్టు షాకిచ్చింది. అక్రమ ఆస్తుల కేసులో జగన్‌ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. జగన్‌ పబ్లికేషన్స్‌, భారతీ సిమెంట్స్‌, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిలకు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. 
 
అక్రమాస్తుల కేసులో తొలుత సీబీఐ కేసులు విచారించాలని, అప్పటి వరకు ఈడీ రిజిస్టర్‌ చేసిన కేసుల విచారణ ఆపాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది.  ఈడీ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం సెప్టెంబర్‌ 5లోగా సమాధానం చెప్పాలని ప్రతివాదులుగా ఉన్న విజయసాయిరెడ్డి, భారతీ సిమెంట్స్), జగతి పబ్లికేషన్స్‌లకు నోటీసులు ఇచ్చింది. 
 
ఈ కేసు పూర్తి స్థాయి విచారణ ద్విసభ్య ధర్మాసనం చేపట్టాలో, త్రిసభ్య ధర్మాసనం చేపట్టాలో ఆరోజే నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ, ఈడీ కేసుల విచారణ సమాంతరంగా కొనసాగించవచ్చని గతంలో హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు తీర్పునివ్వగా, తెలంగాణ హైకోర్టు దాన్ని పక్కన పెడుతూ సీబీఐ ఛార్జిషీట్‌పై తీర్పు వెల్లడైన తర్వాతే ఈడీ కేసుల విచారణ చేపట్టాలని 2021లో తీర్పు ఇచ్చింది. 
 
మరోవైపు జగన్‌ అక్రమాస్తుల కేసులో భాగంగా జప్తు చేసిన భారతీ ఆస్తుల విడుదలకు గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈడీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ కేసు విచారణను ఈ నెల 14న సుప్రీంకోర్టులో జరగనుంది. జప్తు ఆస్తులకు సమాన విలువైన ఎఫ్‌డీలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.