ప్రపంచానికి ప్రేమను పంచిన మహనీయుడు సత్యసాయి బాబా

ప్రపంచానికి ప్రేమను పంచిన మహనీయుడు సత్యసాయి బాబా
ప్రపంచానికి ప్రేమను పంచిన మహనీయుడు సత్యసాయి బాబా అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సాయి హీరా గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను వర్చువల్‌గా ప్రధాని ప్రారంభిస్తూ కోట్లమందికి సత్య సాయిబాబా ఆదర్శంగా నిలిచారని తెలిపారు.  ప్రపంచానికి ఆయన సేవా మార్గాన్ని చాట్ చెప్పారని గుర్తు చేశారు. దేశ యువతకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ కేంద్రం ద్వారా దేశానికి ఎంతో మంది మేధావులను అందజేసిన వాళ్లమవుతామని తెలిపారు.
 
పుట్టపర్తి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం ఒక గొప్ప అనుభూతి అని చెప్పారు. సత్యసాయిబాబా నడియాడిన పుణ్యభూమికి తప్పకుండా వస్తానని చెబుతూ ప్రజలను ఆశీర్వదించేందుకు కాదు సత్యసాయి బాబా ఆశీర్వాదం పొందేందుకు అని చెప్పారు. గతంలో గుజరాత్ లో భూకంపం వచ్చినప్పుడు పేద ధనిక తారతమ్యం లేకుండా సత్యసాయిబాబా అందించిన సేవలు తనకు ఎంతో స్ఫూర్తి కలిగించాయని పేర్కొన్నారు.
 
విద్యార్థులకు పౌష్టికాహారాన్ని దృష్టిలో పెట్టుకొని రాగిజావ పథకాన్ని సత్యసాయి ట్రస్ట్ ప్రారంభించడం అభినందనీయం అని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని రాష్ట్రాల్లోనూ ఈ పథకం అమలు కావాలని  ప్ర‌ధాని ఆశాభావం వ్యక్తం చేశారు. సత్యసాయి బాబా పేరిట ఏర్పడిన జిల్లాను డిజిటలైజేషన్ చేసేందుకు, సాంకేతిక సేవలు అందించేందుకు ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.
 
 జీ 20 సదస్సుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం మనకు లభించిందని చెబుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను శాస్త్ర సాంకేతికతను వినియోగించుకుంటే మరింత వేగంగా ముందుకెళ్తామని ప్రధాని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు సత్యసాయి ట్రస్ట్ అవలంబిస్తున్న సోలార్ పవర్ విధానాన్ని మరింత వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు.
 
మనం ప్రారంభించిన యోగాను ప్రపంచ దేశాలు అనుసరిస్తుండడం ఎంతో సంతోషం కలిగిస్తోందని ప్రధాని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ముందుకెళితే ప్రపంచ దేశాలకు భారత్ ఆది గురువుగా నిలవడం ఖాయం అని భరోసా వ్యక్తం చేశారు. జపాన్ లో పర్యావరణ పరిరక్షణ కోసం శాస్త్ర, సాంకేతికతతో చిన్నచిన్న అడవులను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. హీరా, సత్యసాయి ట్రస్ట్ సంయుక్తంగా ఇలాంటి అడవులను దేశంలోనూ సృష్టించాలని ప్రధాని సూచించారు.