కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం కొత్తగా ఆన్లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇకపై ఇందులోనే రాజకీయ పార్టీలు తమ ఆర్థిక వివరాలను వెల్లడించాల్సి ఉంటుందని పేర్కొంది. ఆర్థిక వివరాలతో పాటు పార్టీలకు సంబంధించిన ఎన్నికల ఖర్చులు, పార్టీకి వచ్చిన విరాళాలకు సంబంధించిన వివరాలను ఈ పోర్టల్ ద్వారా అందించవచ్చని చెప్పింది.
రాజకీయ పార్టీల ఆదాయ, వ్యయాలకు సంబంధించి మూడు రకాల నివేదికలు దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్ తెలిపింది. దీని కోసం వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. తద్వారా సకాలంలో రాజకీయ పార్టీల కాంట్రిబ్యూషన్ రిపోర్ట్, ఆడిట్ చేయబడిన ఖాతాల వివరాలను తెలుసుకునేందుకు వీలుంటుందని ఈసీ భావిస్తోంది.
దేశంలో ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించే లక్ష్యంతో ఎన్నికల కమిషన్ ఈ ఆన్లైన్ పోర్టల్‌ను తీసుకువచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఈ పోర్టల్‌ను 3సీ వ్యూహంలో భాగంగా పోర్టల్‌ను తీసుకువచ్చినట్లు చెప్పింది. అక్రమ నిధులను అరికట్టడం, రాజకీయ పార్టీల నిధులు, ఖర్చుల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యం పోర్టల్‌ను తీసుకువచ్చినట్లు చెప్పింది.
తమ ఆర్థిక నివేదికను ఆన్లైన్లో ఇవ్వకూడదని భావిస్ అందుకు గల కారణాలను రాతపూర్వకంగా తెలియజేయాలని, ఆన్లైన్లో సమర్పించకపోతే నిర్దేశించిన ఫార్మాట్లో సీడీలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ కాపీ ఫార్మాట్లో నివేదికను అందజేయాలని స్పష్టం చేసింది. ఆన్లైన్లో ఆర్థిక నివేదికలను దాఖలు చేయనందుకు పార్టీ పంపిన సమర్థన లేఖతో పాటు అలాంటి అన్ని నివేదికలను ఆన్లైన్లో ప్రచురిస్తుందని ఈసీ పేర్కొంది.
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ ఆర్థిక ఖాతాలను https://lems.ec.gov.in అనే వెబ్ పోర్టల్‌లో పొందుపరచాలని ఈసీ ప్రకటించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951, కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఆర్థిక నివేదికలను రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఇలా వెబ్ పోర్టల్‌లో నివేదికలను అందించడం ద్వారా రాజకీయ పార్టీలకు ఎదురయ్యే ఇబ్బందులను కూడా అధిగమించవచ్చని, ఆన్లైన్ సదుపాయం ద్వారా పారదర్శకత స్థాయి కూడా పెరుగుతుందని ఈసీ భావిస్తోంది.

More Stories
ఢిల్లీ పేలుడులో మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు!
బీజాపూర్‌లో ఆరుగురు మావోయిస్టుల హతం
`మతమార్పిడి’ చట్టాలపై అత్యవసర విచారణకు సుప్రీం నో