కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య లోపాయికారి ఒప్పందం

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య లోపాయికారి ఒప్పందం
బీజేపీ బీ టీం అనడం రాహుల్ గాంధీ మిడిమిడి జ్ఞానంతో అవగాహనాలేమీతో మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని  ఆయన ఆరోపిస్తూ పార్లమెంట్‌లో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేసాయని గుర్తు చేశారు. కర్నాటకలో గెలవగానే రాహుల్ రెచ్చిపోతున్నారని, కాంగ్రెస్ బిఆర్‌ఎస్ బొమ్మ, బొరుసు లాంటి పార్టీలు అని ఎద్దేవా చేశారు. రెండు పార్టీల డిఎన్‌ఎ ఒకటే అని విమర్శలు గుప్పించారు.
 
రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కేసీఆర్ ఊరేగింపు చేసి సన్మానం చేసిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేదని కిషన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగాలేనంటూ పారిపోయిన వ్యక్తి రాహుల్ గాంధీ అంటూ దుయ్యబట్టారు. అధ్యక్షుడిగా ఘోరంగా విఫలమైన వ్యక్తి అయిన రాహుల్ గాంధీకి బీజేపీని విమర్శించే హక్కు లేదని స్పష్టం చేశారు. ఎవరు ఎవరికి బీ టీమో అందరికి తెలుసని మండిపడ్డారు.
 
ఖమ్మం సభలో రాహుల్ గాంధీ ఉపన్యాసం విని ప్రజలు నవ్వుకుంటున్నారని చెబుతూ యువరాజు ఊహాలోకంలో విహరిస్తున్నారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిఎద్దేవా చేశారు. తెలంగాణాలో బీజేపీకి భవిష్యత్తులేదని రాహుల్ గాంధీ తెేల్చారని చెబుతూ అయితే  తేల్చాల్సింది అసమర్ధుడైన రాహుల్ గాంధీ కాదని, తెలంగాణ ప్రజలు అని చెప్పుకొచ్చారు.
 
నాలుగు నెలలు ఆగితే ప్రజలే తేలుస్తారన్నారని స్పష్టం చేశారు. 19 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే రాహుల్ గాంధీపై నమ్మకం లేక 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడి బీఆర్ఎస్ గూటికి చేరారని గుర్తు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని రాహుల్ గాంధీ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను అఖిలేష్ యాదవ్ కలిసేందుకు హైదరాబాద్ వచ్చారని పేర్కొంటూ గతనెలలో విపక్షాల సమావేశంలో పాల్గొన్న అఖిలేష్ యాదవ్ ఇప్పుడు కేసీఆర్‌ను కలవడంతోనే వాళ్ళ బంధమేంటో అర్థమౌతుందని పేర్కొన్నారు. కేసీఆర్‌ కాంగ్రెస్‌లోనే నాయకుడిగా ఏదిగారని ఆయన గుర్తుచేశారు.
 
ఇద్దరి డీఎన్ఏ ఒక్కటే, రెండూ కుటుంబ పార్టీలే అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఎంత దూరమో బీఆర్ఎస్ అంతే దూరమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌తో ఎప్పుడు కలిసి పనిచేయలేదని, భవిష్యత్‌లో కలిసి పనిచేయమని తేల్చిచెప్పారు. మజ్లిస్‌ను పెంచి పోషించిన చరిత్ర కాంగ్రెస్ ది అయితే, ఊరేగిస్తున్న చరిత్ర బీఆర్‌ఎస్‌ ది అని దయ్యబట్టారు.
 
రాహుల్ గాంధీ కుటుంబ రాజకీయాలపై మాట్లాడటం హాస్యాస్పదమని కేంద్ర మంత్రి చెప్పారు.  రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? వారి కుటుంబ పెద్దల అండదండలతోనే కదా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ దేశానికి ప్రమాదామని మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పాయ్ చెప్తుండేవారని గుర్తు చేశారు.
 
అధికారం కోసం దేనికైనా దిగజారే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. ప్రధాని పదవిని కాపాడుకోవడం కోసం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే కాంగ్రెస్ పార్టీకి బీజేపీని విమర్శించే నైతిక హక్కులేదని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాంగ్రెస్, బీఆర్ఎస్‌ కుటుంబాలకు కుర్చీ కోసం ఆరాటం తప్ప నైతిక విలువలు లేని పార్టీలు అని, అందుకే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయిందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒక నాణేనికి బొమ్మ బొరుసు లాంటివని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. తాము తెలంగాణ ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు.