తొలిసారి వెస్టిండీస్ లేకుండా వన్డే ప్రపంచకప్

ఒకప్పుడు క్రికెట్‍లో ఏకచ్ఛత్రాధిపత్యం చెలాయించిన వెస్టిండీస్ లేకుండా తొలిసారి వన్డే ప్రపంచకప్ జరగనుంది. 2023 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా శనివారం స్కాట్‍లాండ్‍తో జరిగిన మ్యాచ్‍లో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‍ టోర్నీకి అర్హత సాధించడంలో విండీస్ విఫలమైంది.

48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి వెస్టిండీస్ అర్హత సాధించలేదు. 1975, 1979లో ప్రపంచకప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్ ఇప్పుడు కనీసం టోర్నీకి అర్హత కూడా సాధించలేకపోయింది.  జింబాబ్వేలోని హరారే వేదికగా జరిగిన ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో స్కాట్‍లాండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకోవటంతో విండీస్ బ్యాటింగ్‍కు దిగింది.
 
జేసన్ హోల్డర్ (45), రొమారియో షెఫర్డ్ (36) మినహా వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేకపోయారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 43.5 ఓవర్లలోనే 181 పరుగులకు ఆలౌటైంది. స్కాట్‍ల్యాండ్ బౌలర్లలో బ్రెండన్ మెక్‍ముల్లెన్ మూడు, క్రిస్ సోల్ రెండు, మార్క్ వాట్ రెండు, క్రిస్ గ్రీవ్స్ రెండు వికెట్లు తీశారు.

స్వల్వ లక్ష్యాన్ని స్కాట్‍లాండ్ 43.3 ఓవర్లలోనే ఛేదించింది. 3 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసి విజయం సాధించింది. మాథ్యూ క్రాస్ (74 నాటౌట్), బ్రాండెన్ మెక్‍ముల్లెన్ (69) అద్భుతంగా ఆడి జట్టును గెలిపించారు.

వెస్టిండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్, అకీల్ హొసీన్ చెరో వికెట్ తీసుకున్నారు. స్కాట్‍లాండ్ కట్టడి చేయడంలో విండీస్ పూర్తిగా విఫలమైంది. 2023 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో ఇటీవల జింబాబ్వే, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‍ల్లో ఓడిన వెస్టిండీస్  స్కాట్‍ల్యాండ్‍తో ఓడి టోర్నీకి అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది.

క్వాలిఫయర్స్‌లో తదుపరి ఒమన్‍, శ్రీలంకతో మ్యాచ్‍లు ఆడనుంది వెస్టిండీస్. ఈ మ్యాచ్‍లు గెలిచిన విండీస్‍కు ఎలాంటి ప్రయోజనం ఉండదు. భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు వన్డే ప్రపంచకప్ జరగనుంది.

భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా.. ర్యాంకింగ్‍ల పద్ధతిలో నేరుగా వన్డే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించాయి. ఈ క్వాలిఫయర్స్ నుంచి మరో రెండు జట్లు ప్రపంచకప్ టోర్నీకి క్వాలిఫై అవ్వాల్సి ఉంది. శ్రీలంక, జింబాబ్వే జట్లకు ప్రపంచకప్ అవకాశాలు అధికంగా ఉన్నాయి.