
దేశంలో ఇప్పుడు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశద్రోహ చట్టాన్ని ఖచ్చితంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని న్యాయ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రీతూరాజ్ అవస్థి స్పష్టం చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, పంజాబ్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ చట్టం మాత్రమే దేశానికి సంపూర్ణ భద్రతను కల్పిస్తుందని ఆయన తేల్చి చెప్పారు. గత ఏడాది మేలో సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని ప్రస్తుతానికి అమలును నిలిపివేసింది.
దేశద్రోహ చట్టాన్ని రద్దు చేస్తారనే వార్తలు కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ చట్టాన్ని పూర్తిగా ఎత్తేయాలని, వలసరాజ్యాలప్పటి చట్టాన్ని పూర్తిగా పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందనే డిమాండ్ ఊపందుకుంటోన్న వేళ జస్టిస్ రీతూరాజ్ అవస్థి కీలక వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరింప చేసుకున్నాయి. ఆ చట్టం అమల్లో ఉండటం అత్యవసరమని ఆయన చెప్పారు.
దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి దేశద్రోహ చట్టాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఏడాది మేలో జారీ చేసిన సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఈ చట్టాన్ని కొనసాగించాలనే ప్యానెల్ సిఫారసులను తాము ఇదివరకే సమర్థించామని ఆయన గుర్తు చేశారు.
అయితే, ఈ చట్టం దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి తగినన్ని చర్యలను తీసుకోవాలని ప్రతిపాదించినట్లు వివరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ, జాతీయ భద్రత చట్టం వంటివి వేర్వేరు రంగాల్లో ఉద్దేశించినవని, వాటిని దేశద్రోహ, సంఘ విద్రోహ కార్యక్రమాలను నివారించడానికి ఉపయోగించలేమని జస్టిస్ రీతురాజ్ అవస్థి స్పష్టం చేశారు.
దేశద్రోహం కఠిన చర్యలను తీసుకోవడానికి నిర్దుష్ట చట్టం ఉండాలని తేల్చి చెప్పారు. దేశద్రోహ చట్టం వలసరాజ్యాల వారసత్వంగా ఉండటం దాని రద్దుకు సరైన కారణం కాదని స్పష్టం చేశారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా,జర్మనీలతో సహా అనేక దేశాలు తమ సొంత చట్టాలను కలిగి ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
గత నెలలో ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేశామని ఆయన వెల్లడించారు.
భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124ఏ దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దేశద్రోహ చట్టం ప్రస్తుతం సంపూర్ణ భద్రతను కల్పిస్తుందని వ్యాఖ్యానించారు. జస్టిస్ అవస్థి నేతృత్వంలోని 22వ లా కమిషన్ గత నెల కేంద్ర ప్రభుత్వంకు సమర్పించిన నివేదికలో భారత శిక్షాస్మృతిలోని 124ఎ నిబంధనను కొనసాగించాలని సిఫార్సు చేసింది. అయితే, దుర్వినియోగం కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
న్యాయ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి చేసిన సిఫారసుల గురించి ఆయన ప్రస్తావిస్తూ విధానపరమైన భద్రతల గురించి ప్రస్తావించామని చెప్పారు. దేశద్రోహం కేసులో ఇన్స్పెక్టర్ లేదా అంతకంటే ఎక్కువ స్థాయి పోలీసు అధికారి ప్రాథమికంగా, విచారిస్తారని, ఘటన జరిగిన నాటి నుంచి ఏడు రోజుల్లోగా దర్యాప్తును పూర్తి చేయాల్సి ఉంటుందని సిఫారసు చేసినట్లు వివరించారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం