ఐపీఎల్ లో అత్యంత ప్రజాదరణ ఆటగాడిగా విరాట్ కోహ్లీ

మే 28న ముగిసిన ఐపీఎల్ 2023 గురించి జరిపిన ఓ సర్వే  ప్రకారం ఛాంపియన్ చెన్నై జట్టు సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన జట్టుగా ఉండగా, విరాట్ కోహ్లీ అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాడిగా ఉన్నాడు.  చెన్నై టీమ్‌కు 7.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. గుజరాత్ టైటాన్స్ జట్టు రెండో స్థానంలో ఉంది.
హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ 6.2 మిలియన్లతో ఉంది. ముంబై జట్టు 5.4 మిలియన్లతో 3వ స్థానంలో ఉంది. చెన్నైకి ఇంత ఆదరణ రావడానికి కారణం ధోనీ. ఐపీఎల్ 2023 సమయంలో విరాట్ కోహ్లీని 7 మిలియన్ కంటే ఎక్కువ సార్లు సెర్చ్ చేశారు. ఎంఎస్ ధోని రెండో స్థానంలో ఉన్నాడు. 6 మిలియన్ల మంది సెర్చ్ చేశారు. 3వ స్థానంలో ఉన్న రోహిత్ శర్మ కోసం 3 మిలియన్ల మంది సెర్చ్ చేశారు.

కోహ్లీని ఇంతగా వెతకడానికి కారణం ఉంది. అదే విరాట్- గంభీర్ పోరు. ఈ ఐపీఎల్‌లో అత్యంత చర్చనీయాంశమైన అంశం ఇదే. మే 1న లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. మ్యాచ్ అనంతరం ఎల్‌సీజీ బౌలర్ నవీన్ ఉల్ హక్, విరాట్ కోహ్లీ మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో కోహ్లీ, గంభీర్ మధ్య గొడవ జరిగింది.

నవీన్, రింకూ సింగ్‌లు కూడా అత్యధికంగా సెర్చ్ చేసిన జాబితాలో చేరారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ విజయానికి చివరి 5 బంతుల్లో 30 పరుగులు అవసరం. అప్పుడు యశ్ దయాల్ బౌలింగ్ చేస్తున్నాడు. ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాదిన రింకూ సింగ్ ఉత్కంఠ విజయాన్ని అందించాడు.