బీజేపీపై పోరాటానికి “పేట్రియాటిక్ డెమొక్రటిక్ అలయెన్స్”!

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న విపక్షాలు తలపెట్టిన కూటమికి పీడీఏ అని పేరు పెట్టాలని నేతలు భావిస్తున్నట్టు సమాచారం. పీడీఏ అంటే “పేట్రియాటిక్ డెమొక్రటిక్ అలయెన్స్”. వచ్చే నెలలో శిమ్లా వేదికగా జరగనున్న సమావేశంలో ప్రతిపాదిత పీడీఏ పేరుపై విపక్షాలు ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

విపక్షాల కూటమికి పీడీఏ పేరు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా తెలిపారు.  అంతేకాకుండా సిమ్లాలో జులై 10-12 మధ్యలో జరగనున్న విపక్షాల  సమావేశంలో పీడీఏకి తుది మెరుగులు దిద్ది, బీజేపీపై పోరాటానికి సిద్ధం చేయనున్నట్టు స్పష్టం చేశారు.

“విపక్షాల కూటమి పేరు పీడీఏ అని పెట్టాలని ప్రతిపాదన ఉంది. అయితే తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. పీడీఏ ప్రధాన లక్ష్యం ఒక్కటే. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ఓడించడం. ఇది అన్ని విపక్ష పార్టీలకు స్పష్టంగా తెలుసు,” అని డీ రాజా ఓ పత్రికతో చెప్పారు.

“తమిళనాడులో సెక్యులర్ డెమొక్రటిక్ ఫ్రెంట్ ఉంది. బిహార్లో మహాఘట్బంధన్ ఉంది. ఇప్పుడు వచ్చే పేరు  విపక్షాలన్నింటిని ఒక్కటి చేసి, లక్ష్యంవైపు నడిపించే విధంగా ఉండాలి,” అని సీపీఐ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు.

మరోవైపు,  పట్నా వేదికగా కొన్ని రోజుల ముందు  విపక్షాల సమావేశం జరిగింది. దేశంలోని దాదాపు అన్ని విపక్ష పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. “ఇకపై విపక్షం అని పిలవకండి. పేట్రియాటిక్ అని పిలవండి,” అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఇవన్నీ చూస్తుంటే బీజేపీపై పోరాటం కోసం కలిసి అడుగులు వెస్తున్న విపక్షాల కూటమి పేరు పీడీఏ అవుతుందని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి.