యూపీ పోలీసు ఉద్యోగాల్లో 20 శాతం మహిళలకే

ఉత్తర ప్రదేశ్ లో  పోలీస్ రిక్రూట్‌మెంట్ 2023లో మహిళా అభ్యర్థులకు 20 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తామని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ప్రకటించారు. మహిళల భద్రత, గౌరవం, సాధికారతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పీఏసీలో మహిళా బెటాలియన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు యూపీలోని గోరఖ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో యోగి వెల్లడించారు.
 
 2017 వరకు యూపీ పోలీసుల్లో మహిళా సిబ్బంది సంఖ్య పది వేలు కాగా, ప్రస్తుతం ఈ సంఖ్య 40 వేలుగా ఉందని ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్ (యుపీపీఆర్సీబీ) యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2023 కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు జూన్ 21న ప్రకటించింది.
 
మొత్తం 52,699 కానిస్టేబుల్ పోస్టులు, 2,469 ఎస్సై పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ చేపట్టనున్నారు. పోలీసు శాఖలోని మొత్తం 62,424 పోస్టుల కోసం బోర్డు రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నిర్వహిస్తుంది. యూపీ పోలీస్ కానిస్టేబుల్స్ రిక్రూట్‌మెంట్ 2023కి సంబంధించిన నోటిఫికేషన్ జూలై 15న విడుదల చేయబోతున్నారు.
 
ఇందులో 52699 కానిస్టేబుల్ పోస్టులతో పాటు 2,469 ఎస్సై, 2430 రేడియా ఆపరేటర్, 545 క్లర్కులు, 872 కంప్యూటర్ ఆపరేటర్లు, 2833 జైలు వార్డులు, 521 స్కిల్డ్ ప్లేయర్ పోస్టుల్ని భర్తీ చేయబోతున్నారు. ఈ మొత్తం పోస్టుల్లో 20 శాతం మహిళలకు రిజర్వ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.