భారత్ – అమెరికా మధ్య కీలక రక్షణ రంగ ఒప్పందాలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ రంగానికి సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. రక్షణ రంగంలో అత్యంత కీలకమైన ఫైటర్‌ జెట్ల ఇంజన్ల తయారీలో జనరల్‌ ఎలక్ట్రిక్‌ (జీఈ) సాంకేతికత బదిలీ మొదలు భారీ పేలోడ్లను మోసుకుపోగల మానవ రహిత డ్రోన్ల సరఫరా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతోపాటు ఇస్రో-నాసాల సంయుక్త ప్రాజెక్టులపై ఒప్పందాలు జరిగాయి.

డిఫెన్స్‌ స్టార్ట్‌పల కోసం సంయుక్త సంస్థ– ఇండ్‌స-ఎక్స్‌ లాంఛనంగా ఏర్పాటవ్వగా, అమెరికా నావికాదళ నౌకల మరమ్మతులకు భారత్‌ సహకరించడం, భారత్‌లో యూనిట్‌ ఏర్పాటుకు దిగ్గజ సెమీకండక్టర్ల సంస్థ మైక్రాన్‌ ముందుకు రావడం, హెచ్‌-1బీ వీసాల రెన్యూవల్‌ ప్రక్రియను సులభతరం చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.

తేజ్‌సకు దన్నుగా ఎఫ్‌414 ఇంజన్లు

ప్రస్తుత పరిస్థితుల్లో దేశాల మధ్య యుద్ధాలు జరిగితే గగనతలంపై పట్టున్న వారిదే విజయం అని రక్షణ రంగ నిపుణులు చెబుతుంటారు. యుద్ధాల్లో వాయుసేనల అమ్ముల పొదిలో అత్యంత కీలకమైన ఆయుధాలు ఫైటర్‌ జెట్లు. ఈ జెట్‌ ఇంజన్‌ తయారీ పరిజ్ఞానం అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, రష్యాల వద్ద మాత్రమే ఉంది.

ఆ దేశాలు జెట్‌ ఇంజన్‌ పరిజ్ఞానాన్ని ఇతర దేశాలకు బదలాయించేందుకు ససేమిరా అంగీకరించవు. భారత్‌ అనేక రంగాల్లో స్వయంసమృద్ధి సాధించినా జెట్‌ ఇంజన్ల విషయంలో పురోగతి లేదు. 1986లోనే దేశీయ యుద్ధ విమానాల తయారీకి ప్రాజెక్టును ప్రారంభించి, రూ.వేల కోట్లు వెచ్చించినా లక్ష్యాన్ని చేరలేదు.

దీంతో  మేకిన్‌ ఇండియాలో భాగంగా రూపొందిస్తున్న తేజస్‌ (మార్క్‌-2) యుద్ధ విమానాలకు జనరల్‌ ఎలక్ట్రిక్‌(జీఈ)కి చెందిన ఎఫ్‌404 ఇంజన్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 75 ఎఫ్‌404 ఇంజన్లు భారత్‌కు దిగుమతి అవ్వగా, మరో 99 రావాల్సి ఉంది. ఎఫ్‌414 రకానికి చెందిన మరో 8 ఇంజన్లు దిగుమతి అయ్యాయి.

మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఎఫ్‌414 ఇంజన్లను భారత్‌కు చెందిన హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌)తో కలిసి ‘మేకిన్‌ ఇండియా’లో భాగంగా తయారు చేసేలా ఒప్పందం కుదిరింది. జెట్‌ ఇంజన్ల తయారీ సాంకేతికతను భారత్‌కు బదలాయించేందుకు అంగీకరించినట్లు జీఈ చైర్మన్‌, సీఈవో హెచ్‌.లారెన్స్‌ కల్ప్‌ వెల్లడించారు.

అయితే, అమెరికా కాంగ్రెస్‌ ఇందుకు ఆమోదం తెలిపితేనే టెక్నాలజీ బదిలీ జరుగుతుంది. ఇందుకు ఎంత సమయం పడుతుందనేది చెప్పలేమని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.

ఎంక్యూ-9 డ్రోన్లు

జనరల్‌ ఆటమిక్స్‌ ఏరోనాటికల్‌ సిస్టమ్స్‌(జీఏ-ఏఎ్‌సఐ) తయారీ అయిన ఎంక్యూ-9 రకం ‘రీపర్‌’ సాయుధ డ్రోన్ల సరఫరాకు కూడా భారత్‌ ఒప్పందం కుదుర్చుకుందని వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం భారత్‌ ఎంక్యూ-1 ప్రిడేటర్‌ రకం డ్రోన్లను వాడుతుండగా, ఎంక్యూ-9 యూఏవీలు అధిక సామర్థ్యంతో పనిచేసే అధునాతన డ్రోన్లు. ఎంక్యూ-1తో పోలిస్ 5రెట్లు అధిక బరువున్న పేలోడ్‌(వార్‌హెడ్స్‌)ను మోసుకుపోగలవు.

నిరంతర నిఘాకు, దాడులకు ఈ డ్రోన్లు ఉపయోగపడతాయి. ఎంక్యూ-9 డ్రోన్‌ బరువు 1,746 కిలోలు కాగా.. 50వేల అడుగుల ఎత్తులో ఎగరగలవు. 1,361 కిలల బరువున్న పేలోడ్స్‌ను మోసుకుపోగలవు.

ఇండ్‌స-ఎక్స్‌ ప్రారంభం

రక్షణ రంగంలో భారత్‌-అమెరికా భాగస్వామ్యం దిశలో మరో ముందడుగు పడింది. ఇరు దేశాలకు సంబంధించిన స్టార్ట్‌పలకు దన్నుగా నిలిచేలా ఇండియా-యునైటెడ్‌ స్టేట్స్‌ డిఫెన్స్‌ యాక్సలరేషన్‌ ఎకో సిస్టమ్‌(ఇండ్‌స-ఎక్స్‌) సంస్థ గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ స్ఫూర్తితో.. మేకిన్‌ ఇండియా లక్ష్యంతో ఇండ్‌స-ఎక్స్‌ పనిచేస్తుంది.

ప్రస్తుతం ఈ సంస్థలో 15 భారతీయ, 10 అమెరికా స్టార్ట్‌పలు ఉన్నాయి. ఇండ్‌స-ఎక్స్‌పై రెండేళ్లుగా ఇరుదేశాల మధ్య కసరత్తు జరుగుతోంది. మారీటైమ్‌, కృత్రిమమేధ(ఏఐ), అటానమస్‌ సిస్టమ్స్‌, అంతరిక్ష రంగంపై స్టార్ట్‌పలకు ఇండ్‌స-ఎక్స్‌ సహకారం అందజేస్తుంది.

ఐఎస్ఎస్ లోకి భారత్‌

అంతరిక్ష రంగంలో ఆత్మనిర్భరతతో ముందుకు సాగుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు ఇకపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) దన్నుగా నిలవనుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఎంవోయూ ప్రకారం ఇరు సంస్థలు 2024లో సంయుక్తంగా స్పేస్‌ మిషన్‌ను ప్రారంభిస్తాయి. అందుకు సంబంధించిన కసరత్తు ఈ ఏడాదే ప్రారంభమవుతుంది.

అంతేకాదు.. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం(ఐఎస్ఎస్)లో భాగస్వామ్యమయ్యేందుకు భారత్‌ ఆర్టెమిస్‌ ఒప్పందం(1967 నాటి ఔటర్‌ స్పేస్‌ ఒప్పందం) కుదుర్చుకుందని మోదీ ప్రకటించారు. మరోవైపు అమెరికా నౌకాదళానికి చెందిన నౌకల మరమ్మతుల బాధ్యత భారత్‌కు దక్కనుంది.

అటు దిగ్గజ సెమీకండక్టర్ల తయారీ సంస్థ మైక్రాన్‌ భారత్‌లో ఓ యూనిట్‌ను ప్రారంభించనుంది. మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. అప్లైడ్‌ మెటీరియల్స్‌ సంస్థ కూడా భారత్‌కు రావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. దానికి ఆ సంస్థ సీఈవో/అధ్యక్షుడు గ్యారీ.ఇ.డికెర్సన్‌ అంగీకారం తెలిపారు. స్కిల్‌ వర్క్‌స్పే్‌సను ఏర్పాటు చేసేందుకు తాము భారత్‌లోని విద్యాసంస్థలతో కలిసి పనిచేస్తామని ఆయన ప్రకటించారు.