సీట్లు అమ్ముకున్న మెడికల్ కాలేజీల్లో ఈడీ సోదాలు

సీట్లు అమ్ముకున్న మెడికల్ కాలేజీల్లో ఈడీ సోదాలు
 
తెలంగాణాలో మెడికల్ సీట్లు కోట్లాది రూపాయలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేట్ మెడికల్ కళాశాలలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సోదాలు చేపట్టింది. రాత్రి పొద్దుపోయేవరకు జరిగిన సోదాలలో కీలకమైన పలు పాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నది. సుమారు రూ 12,000 కోట్ల కుంభకోణంపై ఈడీ దృష్టి సారించినట్లు తెలుస్తున్నది.
ఈ కాలేజీలు అన్ని కీలకమైన బిఆర్ఎస్ పార్టీ నాయకులకు చెందినవే కావడం గమనార్హం.  ప్రైవేటు మెడికల్ కాలేజీల నిర్వాహకులు పీజీ సీట్లను ముందస్తు ప్రణాళిక ప్రకారం బ్లాక్‌ చేసి, తర్వాత వాటిని కావాల్సిన వారికి భారీ మొత్తానికి విక్రయించారని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు గత ఏడాది ఏప్రిల్‌లో వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై మట్టేవాడ పోలీసులు 129/2022 నంబరుతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పోలీసుల సమాచారం ఆధారంగానే తాజాగా ఈడీ రంగంలోకి దిగింది.సీట్లు అమ్ముకున్న సొమ్ముతో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే కోణంలో దర్యాప్తు ఆరంభించింది.ఈ వ్యవహారంలో రూ.వందల కోట్లు చేతులు మారి ఉంటాయని అనుమానిస్తున్న ఈడీ.. ఆ సొమ్మును ఎక్కడికి మళ్లించారనే విషయంపై కూపీ లాగుతోంది.
పీజీ సీట్లను బ్లాక్‌ చేసి కోట్లు వసూలు చేసి దందాలో భారీగా నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌ జరిగిందనే అనుమానంతో ఈడీ దర్యాప్తు చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా 9 ప్రైవేటు వైద్యకళాశాలలకు సంబంధించి 16 ప్రాంతాల్లో ఈడీ బృందాలు బుధవారం ఏకకాలంలో సోదాలు మొదలుపెట్టాయి.
హైదరాబాద్‌లో సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, ఎల్‌బి నగర్‌ కామినేని కాలేజీ, మేడ్చల్ మెడిసిటీ మెడికల్ కాలేజీ, జూబ్లిహిల్స్‌లోని ప్రతిమ సంస్థ కార్పొరేట్‌ కార్యాలయం, కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కాలేజీ, మహబూబ్‌నగర్‌లోని ఎస్‌వీఎస్‌ కాలేజీ, నల్గొండలోని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రి, ఖమ్మంలోని మమత, రంగారెడ్డిలోని పట్నం మహేందర్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్‌ వైద్య కళాశాలల్లో ఈ సోదాలు జరిగాయి.
హైదరాబాద్ శివార్ల ఉన్న సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో కూడా ఈడీ సోదాలు జరిగాయి. తెలంగాణ కార్మిక మంత్రి మల్లా రెడ్డికి చెందిన మల్లారెడ్డి గ్రూపు సంస్థల ఆధ్వర్యంలో మల్లారెడ్డి మెడికల్ కళాశాల నడుస్తోంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) సిబ్బంది ఈ సోదాలు నిర్వహిస్తున్న చోట ఈడీ బృందాలకు భద్రత కల్పించారు.

అంతేకాకుండా,  హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లోని ప్రతిమ గ్రూప్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో కూడా ఈడీ సోదాలు జరిగాయి. ప్రతిమ గ్రూప్‌నకు చెందిన ఇతర కార్యాలయాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కాలేజీ, ప్రతిమ మల్టీప్లెక్స్‌ లో కేంద్ర ఏజెన్సీ సోదాలు చేపట్టింది. కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.

ఎల్బీనగర్లోని కామినేని మెడికల్ కాలేజీలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కామినేని ఆసుపత్రి ఛైర్మన్ సూర్యనారాయణ, ఎండీ శ్రీధర్ నివాసాల్లోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, మహబూబ్ నగర్‌లోని ఎస్‌వీఎస్ మెడికల్ కాలేజీ, సంగారెడ్డి జిల్లాలో ఎంఎస్‌ఆర్ మెడికల్ కాలేజీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు ఆర్థిక లావాదేవీల రికార్డులను పరిశీలిస్తున్నట్లు సమాచారం.