రచయిత సల్మాన్ రష్దీ జర్మనీ పురస్కారం

వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీ ప్రతిష్టాత్మక జర్మనీ పురస్కారం పీస్ ప్రైజ్ ఆఫ్‌ది జర్మనీ ట్రేడ్‌ను ప్రకటించారు. మిడ్‌నైట్ చిల్డ్రన్, సటానిక్ వర్సెస్ వంటి సంచలనాత్మక అంశాలతో నవలలు రాసిన ఈ బ్రిటిష్ ఇండియన్ రచయిత అలుపెరుగని, వెరపెరుగని, కృతనిశ్చయపు, అంకితభావపు రచనా వ్యాసంగానికి గుర్తింపుగా ఈ అవార్డును ఆయనకు అందించాలని పురస్కార సంబంధిత జర్మనీ జ్యూరీ తెలిపింది.

అక్టోబర్ 22వ తేదీన ఫ్రాంక్‌ఫర్ట్‌లో రష్దీకి ఈ పురస్కారం అందచేస్తారు. ఎప్పుడు పొంచి ఉన్న తీవ్రస్థాయి ముప్పు, అనేక దాడుల నడుమనే ఆయన సాగిస్తున్న సహేతుక రచనాపట్టుకు ఇది తమ గుర్తింపు అని జ్యూరీ ప్రకటించింది. ఆయన రచనలు విశ్లేషణతో, స్థిరమైన సాహితీ సృజనాత్మకతతో, వ్యంగ్యం, హాస్యం, విజ్ఞత సంతరించుకుని ఉంటాయని తెలిపారు.

హింసాత్మక ప్రవృత్తితో ఉండే అధికారిక వ్యవస్థలు యావత్తూ సమాజాన్ని దెబ్బతీస్తాయి. అయితే వ్యక్తుల అంతర్గతమైన బలోపేతమైన ప్రతిఘటనా స్ఫూర్తిని ఏ శక్తి ధ్వంసం చేయలేదని ఈ రచయిత తన సృజనలతో స్పష్టం చేస్తున్నారని ప్రశంసించారు. గత ఆగస్టులో రష్దీ న్యూయార్క్‌లో ఓ సాహిత్యసభకు వెళ్లినప్పుడు ఆయన కత్తిపోట్లకు గురయ్యారు.

1988 నాటి ఆయన నవల ది సటానిక్ వర్సెస్ ఇస్లామ మత విశ్వాసాలను కించపర్చే విధంగా ఉందని దుమారం చెలరేగింది. ఈ క్రమంలో ఇరాన్ అధినేత అయాతుల్లా ఖమేనీ అప్పట్లో ఆయనకు వ్యతిరేకంగా మరణదండన ఫర్మానా వెలువరించారు. దీనితో ఈ రచయిత అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది.

అయినప్పటికీ ఆయన తన నిర్భీతి రచనా ఫిరంగులను ధట్టిస్తూనే ఉన్నారు. వీటిన్నింటిని తాము పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఈ అవార్డు బహుకరిస్తున్నట్లు జ్యూరీ తెలిపింది. ఈ పురస్కారం పరిధిలో ఆయనకు ఫలకం, 25000 యూరోలు ( 27,350 డాలర్లు) అందుతాయి. ఈ అవార్డును 1950లో ఏర్పాటు చేశారు.