బక్రీద్ కు గోవులను రక్షించండి కేసీఆర్

బక్రీద్ కు గోవులను రక్షించండి కేసీఆర్

రంజాన్ తర్వాత అత్యంత పవిత్రమైన బక్రీద్ పండుగను ముస్లింలు ఈ నెల 27న జరుపుకొంటున్న సందర్భంగా గోవులను రాకఁచ్నచేందుకు తగు చర్యలు తీసుకోవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, డిజిపి అంజనీ కుమార్ లకు గోషామహల్ ఎమ్యెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంకు చేతకాని పక్షంలో తమ ఆవులను, దూడలను రక్షించుకొనేందుకు తామే రంగంలోకి దిగుతామని ఆయన స్పష్టం చేశారు.

ఈ బక్రీద్ సందర్భంగా సంబరాలు చేసుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మేకలు, గొర్రెలు కొసుకుని బక్రీద్ సంబరాలు చేసుకుంటే కూడా మాకు ఇబ్బంది లేదు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆవులు, దూడలను కోయరాదు. ఆవులు, దూడలు కోస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు’ అని రాజాసింగ్ హెచ్చరించారు.

ఇప్పటి వరకూ ప్రభుత్వం ఆవులు, దూడల రక్షణకు చర్యలు చేపట్టలేదని,  కనీసం ఎక్కడా చెక్ పోస్ట్‌లు కూడా ఏర్పాటు  చేయలేదని విమర్శించారు. “కు చేతకాకపోతే చెప్పండి మా ఆవులు దూడలు రక్షించుకునేందుకు మేమే రంగంలోకి దిగుతాం” అంటూ హితవు చెప్పారు.

“సీఎం కేసీఆర్‌కు, డీజీపీకి చేతులెత్తి మొక్కుతున్నాను. వెంటనే చర్యలు తీసుకోండి. మతపరమైన గొడవలు కావద్దనే మేం ఇలా అడుగుతున్నాం. మీరు చర్యలు తీసుకోకపోతే మా టీమ్‌లు రంగంలోకి దిగుతాయి.. జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి” రాజాసింగ్ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా ఓ వీడియోను కూడా గోషామహల్ ఎమ్మెల్యే విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, గత నాలుగైదు రోజులుగా గోవుల అక్రమ రవాణా చేయకూడదని, గోవధను ఖండించాలని రాజాసింగ్ వరుస ప్రకటనలు చేసుకుంటూ వస్తున్నారు. గోవుల అక్రమ రవాణాకు తెలంగాణ పోలీసులే సహకరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

పోలీస్ ప్రొటెక్షన్‌తో రాష్ట్రంలో వేల ఆవులు కోతకు గురవుతున్నాయని ఆవేదనకు లోనయ్యారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవుల రక్తంతో తడిసిన రాష్ట్రానికి మంచి జరగదని హెచ్చరించారు. ఛత్రపతి శివాజీ స్పూర్తితో గోరక్షకులు నడుం బిగించాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌‌ ఇటీవలే పిలుపునిచ్చారు.