ఖుష్బూపై అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే నేతపై వేటు

బీజేపీ  నేత కుష్బూ సుందర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే ప్రతినిధి శివాజీ కృష్ణమూర్తిపై వేటు పడింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మరుగన్ ప్రకటించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లింఘించి, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించిన కారణంగా శివాజీ కృషమూర్తిని పార్టీ పదవుల నుంచి, ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

కుష్బు సుందర్‌ను ”పాత పాత్ర” అని సంబోధిస్తూ శివాజీ కృష్ణమూర్తి ఇటీవల అవమానకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అయిన ఖుష్బూ తీవ్రంగా స్పందించారు. ఆయనపై ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి శివాజీ కృష్ణమూర్తిని బహిష్కరిస్తున్నట్లు డీఎంకే ప్రకటించింది. డీఎంకేలో రాజకీయ సంస్కృతిని ప్రతిబింబించేలా తప్పుల మీద తప్పులు చేస్తూ పోవడం శివాజీ కృష్ణమూర్తికి అలవాటుగా మారిందని ఖుష్బూ మండిపడ్డారు.

”వాళ్లకి మాట్లాడడానికి ఏమీ లేనప్పుడు ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలకు దిగుతుంటారు. వ్యక్తుల క్యారెక్టర్‌ను కించపరుస్తుంటారు. దీనిపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఆయనకు మాట్లాడేందుకు ధైర్యం లేదు. డీఎంకే లోని నాయకులకు అనవసరమైన విషయాల గురించి మాట్లాడమంటే సరదా” అని ఖుష్బూ ధ్వజమెత్తారు.

ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో ఖుష్బూను ఉద్దేశిస్తూ శివాజీ కృష్ణమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం చెలరేగింది. ఈ వీడియోను ఆమె ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ సీఎం స్టాలిన్‌ను ట్యాగ్ చేశారు. శివాజీ తన పట్ల చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటుగా ఆమె పేర్కొన్నారు. అవే కామెంట్స్‌ను మీ కుటుంబం లోని మహిళలకుఅంటే మీరు ఊరుకుంటారా? అని ఆమె ఆవేదన వెలిబుచ్చారు.

“మీకు అర్థం కానిది ఏంటంటే ఆయన కేవలం నన్నే కించపరచడం లేదు. మిమ్మల్ని, మీ తండ్రి (ఎంకే కరుణానిధి)గారి లాంటి గొప్ప నేతల్ని సైతం అవమాన పరుస్తున్నారు. మీరు ఆయనకు ఎంత ఎక్కువ చనువు ఇస్తే , మీరు రాజకీయంగా అంత వెనుకబడిపోతారు. మీ పార్టీ అనైతిక వ్యక్తులకు స్వర్గథామంలా మారుతోంది. ఇది సిగ్గు చేటు”.అంటూ ఖుష్బూ ట్వీట్ చేశారు.

కాగా, శివాజీ కృష్ణమూర్తి గతంలోనూ గవవర్నర్‌ సీఎన్ రవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై గవర్నర్ మండిపడటంతో పార్టీ నుంచి ఆయనను డీఎంకే సస్పెండ్ చేసింది. తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడంతో తిరిగి ఆ సస్పెన్షన్‌ను తొలగించింది.