ట్వీట్ ఇచ్చిన తమిళనాడు బిజెపి నేత సూర్య అరెస్ట్

తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ కార్యదర్శి ఎస్‌జీ సూర్యను మధురై పోలీసులు శుక్ర-శనివారాల మధ్య రాత్రి అరెస్ట్ చేశారు. ఆయన ఓ సామజిక సమస్యపై కమ్యూనిస్టు పార్టీ కౌన్సిలర్‌ను ప్రశ్నిస్తూ ఓ ట్వీట్ చేసినందుకు ఈ చర్య తీసుకున్నారు. ఇది అప్రజాస్వామిక చర్య అని తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షుడు కే అణ్ణామలై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సూర్య ఇచ్చిన ట్వీట్‌లో సీపీఎం కౌన్సిలర్ విశ్వనాథన్‌ను నిలదీశారు. మల, మూత్రాలతో నిండిపోయిన డ్రెయిన్‌ను శుభ్రం చేసేవిధంగా ఓ పారిశుద్ధ్య కార్మికుడిని విశ్వనాథన్ నిర్బంధించారని, ఫలితంగా ఆ కార్మికుడు అలర్జీలతో ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.

సీపీఎం కౌన్సిలర్ కారణంగా పారిశుద్ధ్య కార్మికుడి ప్రాణాలు పోయాయని, సీపీఎం మధురై ఎంపీ ఎస్ వేంకటేశన్‌ బూటకపు మౌనాన్ని ఆశ్రయించారని ఆరోపించారు. ‘‘మీ బూటకపు వేర్పాటువాద రాజకీయాలు మురికి గుంట కన్నా ఎక్కువ కంపు కొడుతున్నాయి’’ అని వ్యాఖ్యానించారు. ఓ మనిషిలా బతకడం కోసం ప్రయత్నించాలని సలహా ఇచ్చారు.

దీంతో మధురై పోలీసులు సూర్యపై భారత శిక్షా స్మృతిలోని సెక్షన్లు 153(ఏ), 505(1)(బీ), 505(1)(సీ), ఐటీ చట్టంలోని సెక్షన్ 66(డీ)ల ప్రకారం కేసు నమోదు చేశారు. ఆయనను శనివారం మేజిస్ట్రేట్ సమక్షంలో హాజరు పరుస్తారు.

రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు కే అణ్ణామలై స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, సూర్య అరెస్ట్‌ను ఖండించారు. డీఎంకే మిత్ర పక్షమైన కమ్యూనిస్టుల ద్వంద్వ ప్రమాణాలను వెలుగులోకి తేవడమే సూర్య చేసిన ఏకైక తప్పు అని మండిపడ్డారు. రాత్రికి రాత్రే ఆయనను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వాక్ స్వాతంత్ర్యాన్ని అణచివేసేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవడం, ప్రతి చిన్న విమర్శకు ఆందోళన చెందడం ప్రజాస్వామికంగా ఎన్నికైన నాయకుడికి తగదని హితవు  చెప్పారు. ఇటువంటి చర్యలు ఓ నాయకుడు నియంతగా రూపొందుతున్నాడనేందుకు సంకేతాలని తెలిపారు.

నియంతల నుంచి స్ఫూర్తిని పొందుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రాన్ని చట్టబద్ధ పాలనలేని అడవిగా మార్చుతున్నారని దుయ్యబట్టారు. సూర్యను అరెస్టు చేసినంత మాత్రానికి తాము భయపడబోమని, అరెస్టులు తమను నిరోధించజాలవని స్పష్టం చేశారు. సౌకర్యవంతంగా లేని సత్యాన్ని చూపించడాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.