రెజ్లర్ల `లైంగిక’ ఆరోపణలపై ఆధారాలు కోరిన పోలీసులు

భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా, ఈ ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలుంటే సమర్పించాలని రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు కోరినట్లు సమాచారం.
 
ఫొటోలు, వీడియోలు, వాట్సప్‌ చాటింగ్‌లు ఏవి ఉన్నా తమకు అందజేయాలని సూచించినట్టు తెలుస్తోంది. మరోవైపు, ఈ కేసులో పోలీసులు కూడా సొంతంగా ఆధారాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.  కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని రెజ్లర్లకు ఢిల్లీ పోలీసులు సీఆర్‌పీసీ 91 నోటీసులు అందజేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
 
దీని ప్రకారం కేసు విచారణకు అవసరమైన ఎలాంటి డాక్యుమెంట్ల అయినా దర్యాప్తు అధికారి కోరవచ్చు. అందులో భాగంగా ఫిర్యాదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలున్నా తమకు అందజేయాలని ఫిర్యాదు చేసిన రెజ్లర్లను కోరారు.
 
ఇలా ఉండగా, తమ డిమాండ్లు పరిష్కారమైతేనే ఈ ఏడాది జరగబోయే ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గంటామని, లేదంటే వాటిని బహిష్కరిస్తామని రెజర్లు హెచ్చరించారు.  ”ఈ సమస్యలనీు పరిష్కారమైతేనే మేం ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గంటాం. మేం ప్రతిరోజూ మానసికంగా ఎంతటి వేదన అనుభవిస్తున్నామో మీకు అర్థం కాదు” అని  సాక్షి మలిక్‌ శనివారం తెలిపారు.
కాగా, 2023 ఏషియన్‌ గేమ్స్‌ చైనాలో వచ్చే సెప్టెంబర్‌లో జరుగనున్నాయి. గత ఒలంపిక్స్‌-2018లో జరిగిన ఏసియన్‌ గేమ్స్‌లో బజరంగ్‌ పూనియా, వినేష్‌ ఫోగట్‌ లు బంగారు పతకాలు గెలుచుకున్నారు.
మరోవంక,  ఉత్తరప్రదేశ్‌లోని కైసరగంజ్‌ నియోజకవర్గం నుంచి తిరిగి తాను 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని బ్రిజ్ భూషణ్ సింగ్ ప్రకటించారు. రెజ్లర్ల వివాదంలో ఇప్పటికే రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదై, త్వరలోనే అరెస్టు కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
 
నరేంద్ర మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని యూపీలోని గోండాలో ఆదివారం జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ టాప్ రెజ్లర్లు వినేష్ ఫోగత్, సాక్షి మాలిక్, బజ్రంగ్ పూనియా తదితరుల పేర్లను డబ్ల్యూఎప్ఐ చీఫ్ నేరుగా ప్రస్తావించకుండా ”ఆప్యాయంగా చూసినందుకు అవిశ్వాసాన్ని ప్రకటించారు” అంటూ ఒక కవిత వినిపించారు.
బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా అగ్రశ్రేణి రెజర్లు చేపట్టిన ఆందోళన ఉద్ధృతమవడంతో స్పందించిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌.. వారితో చర్చలు జరిపారు. బ్రిజ్‌ భూషణ్‌పై ఈ నెల 15 లోపు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని, జూన్‌ 30 లోపు డబ్ల్యూఎఫ్‌ఐకి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో.. రెజ్లర్లు తమ ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు.