24 గంటల్లో అత్యంత తీవ్రమైన తుపానుగా బిపోర్జాయ్

రానున్న 24 గంటల్లో బిపోర్జాయ్ అత్యంత తీవ్రమైన తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుపాను కారణంగా కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ లలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మత్స్యకారులు చేపల వేటకు అరేబియా సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది. రానున్న 24 గంటల్లో బిపోర్జాయ్ మరింత బలపడి అత్యంత తీవ్రమైన తుపానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉత్తర – ఈశాన్య దిశగా కదులుతున్న ఈ తుపాను వల్ల కేరళ, కోస్టల్ కర్ణాటక, లక్షద్వీప్ లలో వచ్చే మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.  దాంతో, తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలపుఝ, కొట్టాయం, ఇదుక్కి, కోజికోడ్, కన్నూర్ లకు కేరళ ప్రభుత్వం యెల్లో అలర్ట్ జారీ చేసింది. కేరళ, కర్ణాటకల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి.

బిపోర్జాయ్ తుపాను కారణంగా తీరం వద్దకు పెద్ద ఎత్తున అలలు వస్తున్న కారణంగా, అరేబియా తీరంలోని వల్సాద్ లో ఉన్న తిథల్ బీచ్  సహా పలు బీచ్ లలోనికి పర్యాటకులను అనుమతించడం లేదు. జూన్ 14 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. తీరం సమీపంలోని గ్రామాల ప్రజల కోసం సురక్షిత ప్రాంతాల్లో షెల్టర్లు ఏర్పాటు చేశారు.

 ఈ తుపాను కారణంగా రానున్న ఐదు రోజుల పాటు దాదాపు అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కేరళ, కర్ణాటక తీర ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. జూన్ 10, 11 తేదీల్లో పశ్చిమ బెంగాల్, అస్సాంలలో కూడా వర్షాలు కురుస్తాయి.