
తమ వద్ద ఉన్న అక్రమ ఆయుధాలను అప్పగించాల్సిందిగా మణిపూర్‌లోని ప్రజలకు కేంద్ర హోం మంత్రి విజ్ఞప్తి చేసిన ఒక రోజు తర్వాత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 140కి పైగా ఆయుధాలను అప్పగించినట్లు అధికార వర్గాలు శుక్రవారం తెలియజేశాయి. మణిపూర్‌లో తన నాలుగు రోజుల పర్యటన చివరి రోజయిన గురువారం నాడు అమిత్ షా అక్రమ ఆయుధాలను సైన్యానికి, అధికారులకు సరెండర్ చేయాల్సిందిగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
రాష్ట్రవ్యాప్తంగా సోదాలు, కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని, ఎవరివద్దనైనా ఆయుధాలు కలిగి ఉన్నట్లు తేలితే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ఆయన హెచ్చరించారు. ఇంఫాల్‌లో అమిత్ షా హెచ్చరిక తర్వాత శుక్రవారం ఉదయం వరకు 140కి పైగా ఆయుధాలను సరెండర్ చేసినట్లు అధికారులు తెలిపారు. గత నెల హింసాకాండ చెలరేగడంతో పోలీసు స్టేషన్‌ల నుండి సుమారు 2,000కు పైగా ఆయుధాల లూటీ జరిగిందని పోలీసులు తెలిపారు.
మణిపూర్‌లో అక్కడక్కడ ఖాళీగా ఉన్న ఇళ్లు తగులబెట్టడం లాంటి సంఘటనలు జరిగినా పరిస్థితి మొత్తం మీద ప్రశాంతంగా ఉందని అధికారులు తెలిపారు. సరెండర్ చేసిన ఆయుధాల్లో సెల్ఫ్ లోడెడ్ రైఫిళ్లు, కార్బైన్, ఎకె, ఇన్సాస్ రైఫిళ్లు, లైట్ మెషిన్ గన్స్, పిస్టల్స్, ఎం 16 రైఫిళ్లు, స్మోక్ గన్, స్టెన్‌గన్,గ్రెనేడ్ లాంచర్ ఉన్నట్లు వారు తెలిపారు.
కొద్ది రోజుల క్రితం హింసాత్మక ఘటనలతో అట్టుడికిన మణిపూర్ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దాంతో అధికారులు ఆ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేశారు. కర్ఫ్యూ ఎత్తివేసిన జిల్లాల్లో తమెంగ్లాంగ్, నోనీ, సెనాపతి, ఉఖ్రుల్, కమ్‌జోంగ్ ఉన్నాయని పోలీసులు శుక్రవారం వెల్లడించారు.
అదేవిధంగా తక్కువ సమస్యాత్మకంగా ఉన్న మరికొన్ని జిల్లాల్లో కొన్ని గంటలపాటు కర్ఫ్యూను సడలించినట్లు మణిపూర్ పోలీసులు తెలిపారు. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, బిష్ణుపూర్, జిరిబమ్, తౌబాల్, కాక్‌చింగ్, చురాచంద్‌పూర్, చందేల్, తెగ్నౌపాల్, కంగ్‌పోక్పీ, ఫెర్‌జౌల్ జిల్లాల్లో ఇవాళ కొన్ని గంటలపాటు కర్ఫ్యూను సడలించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో సాధారణ పరిస్థితులే ఉన్నాయని అక్కడి పోలీసులు పేర్కొన్నారు.
మే 3 నుంచి మణిపూర్‌లో ప్రారంభమైన హింసాకాండాలో ఇప్పటి వరకూ 98 మంది మరణించగా, మరో 310 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని మణిపూర్ ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. ప్రస్తుతానికి 272 మంది సహాయక శిబిరాల్లో 37,450 మంది ఆశ్రయం పొందుతున్నారని తెలిపింది. ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ) ఈ ప్రకటనను విడుదల చేసింది.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!