రాహుల్ సభలో ఖలిస్థానీ మద్దతుదారుల హల్‌చల్‌

అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతుండగా కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు హల్‌చల్‌ చేశారు. రాహుల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ కాలిఫోర్నియాలో ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన ‘మొహబత్‌ కి దుకాణ్ ‘ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా సభలో కూర్చున్న కొందరు ఖలిస్థానీ సానుభూతిపరులు ఆందోళన చేపట్టారు. ఖలిస్థాన్ జెండాను ఎగురవేస్తూ ప్రత్యేక ఖలిస్థాన్ నినాదం చేశారు.  కాంగ్రెస్‌ హయాంలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావిస్తూ రాహుల్‌ గాంధీ ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ఆ నినాదాలకు రాహుల్‌ స్పందిస్తూ  ”విద్వేష మార్కెట్లో ప్రేమ దుకాణాలు” అని పేర్కొన్నారు. ఆ వెంటనే సభలోని కాంగ్రెస్‌ మద్దతుదారులు భారత్‌ జోడో అంటూ నినాదాలు చేశారు.  అనంతరం దీనిపై రాహుల్‌ మాట్లాడుతూ ”కాంగ్రెస్‌ పార్టీకి ప్రతి ఒక్కరిపైనా అభిమానం ఉంటుంది. మేం ఎవరి పట్లా కోపాన్ని, ద్వేషాన్ని ప్రదర్శించబోం. ప్రతి వ్యక్తి ఆవేదనను వింటాం” అని తెలిపారు.

కాగా, ఖలిస్థానీ సానుభూతిపరులు నినాదాలు చేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ సంఘటనపై బిజెపి నేత అమిత్ మాలవ్య స్పందిస్తూ “1984 కాంగ్రెస్ రగిల్చిన సిఖ్ ఊచకోతకు అమెరికాలో రాహుల్ గాంధీని ఎద్దేవా చేశారు. మీరు వెలిగించిన విద్వేషపు అగ్ని ఇంకా రగులుతూనే ఉంది” అంటూ ధ్వజమెత్తారు.