పొగాకు ఉత్పత్తులు, వినియోగంలో రెండో స్థానంలో భారత్‌

గ్లోబల్‌ అడల్ట్‌ టొబాకో సర్వే ఇండియా (జీఏటీఎస్‌2) ప్రకారం మన దేశంలో 27 కోట్ల మంది పొగాకును వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే పొగాను అత్యధికంగా పండించడం, పొగాకు ఉత్పత్తులు, వినియోగంలో భారత్‌ రెండో స్థానంలో ఉంది.  పొగాకు నమలడం, ధూమపానం వల్ల స్ట్రోక్స్‌, గుండెపోటు, ఊపిరిత్తుల సమస్యలు, పలు రకాల క్యాన్సర్లతోపాటు నోరు, గొంతు, ఊపిరితిత్తులు, పాంక్రియాస్‌, బ్లాడర్‌, మూత్రపిండాలు, కాలేయ సమస్యలు వేధిస్తాయి. ధూమపానం వల్ల ప్రతి ఏడాది 12 లక్షల మంది మృత్యువాత పడుతున్నట్టు చెబుతున్నారు.
 
ధూమపానం ఊపిరిత్తుల పనితీరు విభాగాన్ని దారుణంగా దెబ్బతీసే ధ్వంసం చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. `నో టొబాకో డే’ను ప్రతి సంవత్సరం మే 31న జరుపుకుంటారు. ఈ సందర్భంగా పొగాకు వలన కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. ప్రజల జీవితాలను పీల్చి పిప్పి చేస్తున్న వాటిలో ధూమపానం ఒకటి. అది ప్రమాదకరమని తెలిసినా చాలామంది ఆ అలవాటు నుంచి బయటపడలేక ప్రాణాలను పణంగా పెడుతున్నారు.
 
 ‘స్మోకింగ్‌ ఈజ్‌ ఇంజ్యూరియస్‌ టు హెల్త్‌’ అని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు అవగాహన కల్పిస్తున్నా, పొగాకు వినియోగం తగ్గట్లేదు సరికదా, మరింత పెరుగుతున్నది. ధూమపానం కారణంగా క్యాన్సర్‌, గుండె, ఊపిరితిత్తుల జబ్బులు చుట్టుముడతాయి.  మనిషి నాణ్యమైన జీవితాన్ని ఇది దారుణంగా దెబ్బతీస్తుంది. ప్రపంచం బుధవారం ‘నో టొబాకో డే’ను జరుపుకుంటున్నది.
ఈ నేపథ్యంలో ధూమపానానికి దూరంగా ఉండాలని నిపుణులు కోరుతున్నారు. ధూమపానం వల్ల విషపూరిత రసాయనాలు వాయునాళాలు, లంగ్స్‌ లైనింగ్‌ను దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు.  ఫలితంగా రోగ నిరోధకశక్తి తగ్గిపోతుందని,  ప్రపంచవ్యాప్తంగా 20 శాతం మందికిపైగా టీబీ బారినపడడానికి ధూమపానమే కారణమని చెబుతున్నారు. నికోటిన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ, స్మోక్‌ ట్రిగ్గర్లను ఉపయోగించడం, సోషల్‌ నెట్వర్కింగ్‌, షుగర్‌లెస్‌ గమ్స్‌ నమలడం వంటివాటి ద్వారా ధూమపానం కోరిక నుంచి దూరంగా జరగొచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.