రాష్ట్రంలో ఒక వంక ఎండలు మండిపోతూ, పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండగా, మరోవంక రాగల మూడు రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పింది.
అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్‌లో ఆదివారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం దాకా భానుడి భగభగలతో అల్లాడిన భాగ్యనగరం అకస్మాత్తుగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున్నది. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేటలో వర్షం పడింది.
సోమవారం పలుచోట్ల పొడి వాతావరణం ఏర్పడుతుందని, మరికొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కొన్నిచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం నుంచి జూన్ 3 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని, పలుచోట్ల ఈదురుగాలులతో వానలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.
వర్షాలు పడే జిల్లాల్లో గంటకు30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర దక్షిణ ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఏర్పడిందని పేర్కొంది.
మరోవైపు మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ తో పాటు పరిసర చుట్టు పక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

More Stories
విబి-జి రామ్ జి చట్టం పారదర్శకతకు ప్రతీక
కట్టమైసమ్మ దేవి ఆలయం సమీపంలో మలవిసర్జనతో ఉద్రిక్తత
సోమనాథ్ ఆలయం భారతీయ ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక