రామకృష్ణ మిషన్‌ సేవలు మరువలేనివి

రామకృష్ణ మిషన్‌ సేవలు మరువలేనివని చెబుతూ భారత సనాతన సంప్రదాయాలను, సంస్కృతిని అందరికీ తెలిసేలా చేశారని  పద్మభూషణ్‌ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి కొనియాడారు.  రామకృష్ణ మిషన్‌ స్థాపించి 125 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాదిపాటు నిర్వహించిన కార్యక్రమాల ముగింపు సందర్భంగా హైదరాబాద్‌ రామకృష్ణ మఠంలో మాట్లాడుతూ బేలూరు మఠాన్ని సందర్శించాలని ఉందని చెప్పారు.

ఈ సందర్భంగా రామకృష్ణ మఠంలోని వివేకానంద ఆడిటోరియంలో భిన్నత్వంలో ఏకత్వం అనే అంశంపై జరిగిన సదస్సులో మాట్లాడుతూ 11వ శతాబ్దిలో రామానుజాచార్యుడు ప్రతిపాదించిన వేదాంత దర్శనం విశిష్టాద్వైతం గురించి చిన్నజీయర్‌ స్వామి వివరించారు. సాకారుడైన నారాయణుడు పరబ్రహ్మమైన భగవంతుడని ఈ తత్వము ప్రతిపాదించిందని చెప్పారు.
 
రామానుజాచార్యుడు ఆనాడే హరిజనులకు దేవాలయ ప్రవేశం చేయించి అందరినీ సమానంగా చూశారని చిన్నజీయర్‌ స్వామి చెప్పారు. హైదరాబాద్‌ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద అధ్యక్షత వహించారు.  అద్వైత సిద్ధాంతం గురించి అమెరికా అర్ష విద్య గురుకులం ఉపాధ్యక్షులు స్వామి తత్వవిదానంద సరస్వతి, దైత సిద్ధాంతం గురించి కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం డీన్‌ ఆచార్య వీరనారాయణ ఎన్‌.కే.పాండురంగి మాట్లాడారు.
 
రామకృష్ణ వివేకానంద వేదాంత సంప్రదాయాల గురించి బేలూరు రామకృష్ణ మిషన్‌ వివేకానంద ఎడ్యుకేషనల్‌ అండ్‌ రీసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన స్వామి ఆత్మప్రియానంద మాట్లాడారు. కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌, వివేకానంద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ సిబ్బంది, భక్తులు, వాలంటీర్లు పాల్గొన్నారు.