సివిల్స్ లో తెలంగాణ అమ్మాయి ఉమా హార‌తికి మూడో ర్యాంకు

యూపీఎస్సీ నిర్వ‌హించిన సివిల్స్ 2022 తుది ప‌రీక్ష‌ల ఫలితాలు విడుద‌ల‌య్యాయి. దేశవ్యాప్తంగా 933 మందిని ఎంపిక చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఇషితా కిశోర్ తొలి ర్యాంకు సాధించ‌గా, తెలంగాణ‌కు చెందిన ఉమా హార‌తి ఎన్ మూడో ర్యాంకు సాధించారు. తిరుపతికి చెందిన జీవీఎస్‌ పవన్‌ దత్తా 22 ర్యాంకు సాధించగా.. హెచ్‌ ఎస్‌ భావన 55వ ర్యాంకు సాధించింది.
 
గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా అమ్మాయిలే టాప్‌ ర్యాంకర్లుగా నిలిచారు. 2022 సివిల్స్‌ ఫలితాల్లో తొలి నాలుగు ర్యాంకులనూ అమ్మాయిలే సాధించారు. ఇషితా కిశోర్‌ ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంకుతో అదరగొట్టగా.. గరిమ లోహియా, ఉమా హారతి ఎన్‌. స్మృతి మిశ్రా వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులతో మెరిశారు.
 
మూడో ర్యాంకు సాధించిన నూక‌ల ఉమా హార‌తి నారాయ‌ణపేట ఎస్సీ ఎన్ వెంక‌టేశ్వ‌ర్లు కుమార్తె. ఉమా హార‌తి స్వ‌స్థ‌లం సూర్యాపేట జిల్లాలోని హుజుర్‌న‌గ‌ర్. సివిల్స్ తుది ఫ‌లితాల్లో తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాల‌కు చెందిన ప‌లువురు అభ్య‌ర్థులు ఎంపిక‌య్యారు.  జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా చిట్యాల మండ‌లం గుంటూరుప‌ల్లికి చెందిన శాఖ‌మూరి శ్రీసాయి హ‌ర్షిత్ 40వ ర్యాంకు, జ‌గిత్యాల జిల్లా కోరుట్ల మండ‌లం ఐలాపూర్ గ్రామానికి చెందిన ఏనుగు శివ మారుతి రెడ్డి 132వ ర్యాంకు సాధించారు.

బీవీఎస్ ప‌వ‌న్ ద‌త్తా 22వ ర్యాంకు, హెచ్ఎస్ భావ‌న‌కు 55, సాయి ప్ర‌ణ‌వ్‌కు 60, నిధి పాయ్ 110, అంకుర్ కుమార్ 257, చ‌ల్లా క‌ళ్యాణి 285, వై శృతి 362, శ్రీకృష్ణ 293, హ‌ర్షిత 315, లక్ష్మి సుజిత 311, సోనియా క‌టారియా 376, రేవ‌య్య 410, సీహెచ్ శ్ర‌వ‌ణ్ కుమార్ రెడ్డి 426, రెడ్డి భార్గ‌వ్ 772, నాగుల కృపాక‌ర్ 866వ ర్యాంకు సాధించారు.

మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిని పర్సనాలిటీ టెస్టు కోసం ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఇంటర్వ్యూ చేసింది. ఫైనల్‌గా 933 మందిని వేర్వేరు సర్వీసులకు ఎంపిక చేసింది. మొత్తం 345 మంది జనరల్‌ కోటాలో ర్యాంకులు సాధించారు. ఇక 99 మంది ఈడబ్ల్యూఎస్ కోటాలో, 263 మంది ఓబిసి కోటాలో, 154 మంది ఎస్సి కోటాలో, 72 మంది ఎస్టీ కోటాలో 2022 సివిల్‌ సర్వీసులకు ఎంపికయ్యారు. ఐఏఎస్‌ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 38, ఐపీఎస్‌కు 200 మంది చొప్పున ఎంపికయ్యారు.