కులాల వారీ  జనాభా లెక్కింపుకు సుప్రీం కోర్టు నిరాకరణ

బిహార్ లో కులాల వారీగా జనాభా లెక్కింపుపై పాట్నా హైకోర్టు విధించిన మధ్యంతర స్టే ను ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాష్ట్రంలో కులాల వారీగా జనాభా లెక్కించడంపై పాట్నా హైకోర్టు మే 4న మధ్యంతర స్టే విధించింది.  స్టే విధించడంపై సత్వర విచారణ చేపట్టాలని కోరుతూ బిహార్ సర్కార్ మే 9న పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

దీన్ని స్వీకరించిన హైకోర్టు విచారణను జులై 3కు వాయిదా వేయడంతో పాట్నా హైకోర్టు మధ్యంతర స్టేపై స్టే ఇవ్వాలని కోరుతూ బిహార్ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్​లీవ్ పిటిషన్​ను గురువారం సుప్రీం కోర్టు విచారించింది.  అయితే ఈ అంశం హైకోర్టులో పెండింగ్‌‌లో ఉందన్న వాదనను సుప్రీంకోర్టు బెంచ్ పరిగణనలోకి తీసుకుంది.

‘‘డేటాను ఎవరు హోస్ట్ చేస్తున్నారు? మేం పూర్తి ప్రక్రియ స్వభావాన్ని పరిశీలిస్తాం. అది సర్వే అయినా జనాభా సెన్సెస్ అయినా’’ అని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా తెలిపింది. హైకోర్టు విధించిన స్టే వల్ల మొత్తం ప్రక్రియపై నెగెటివ్​ ఎఫెక్ట్ పడుతోందని విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. చివరి దశకు వచ్చిన లెక్కింపుపై స్టే విధించడం చాలా నష్టాన్ని కలిగిస్తుందని, ఇన్నాళ్లు చేసినదంతా వృథా అయ్యేలా నెగెటివ్​ఎఫెక్ట్ పడుతున్నదని తెలిపింది.

“రాష్ట్రంలో ఇప్పటికే 80 శాతానికి పైగా సర్వే పనులు పూర్తయ్యాయి. యంత్రాంగం గ్రౌండ్ లెవల్‌‌లో ఉంది. ప్రక్రియ పూర్తి చేయడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. కుల ఆధారిత డేటాను సేకరించడం ఇతర నిబంధనలతో పాటు ఆర్టికల్ 15, 16 ప్రకారం కూడా రాజ్యాంగపరమైనది. ఇంత గ్యాప్ ఇస్తే సర్వేను పూర్తి చేయడం ఆలస్యమై మొత్తం ప్రక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది’’ అని వివరించింది.

బీహార్‌‌లో మొదటి రౌండ్ కులాల సర్వే జనవరి 7 నుంచి 21 మధ్య రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది.  రెండో రౌండ్ ఏప్రిల్ 15 న ప్రారంభమై మే 15 వరకు కొనసాగాల్సి ఉంది. ఈ సర్వేను నిలిపివేయాలని మొదటి రౌండ్​ప్రారంభం కాగానే సుప్రీం కోర్టులో పిటిషన్​దాఖలైంది. అయితే పాట్నా హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా సూచిస్తూ సుప్రీంకోర్టు పిటిషన్​ను డిస్​మిస్ చేసింది.

తర్వాత పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారించిన హైకోర్టు మే4న కులాలా వారీ జనాభా లెక్కింపుపై మధ్యంతర స్టే విధించింది. ఈ స్టేను ఎత్తేయాలని కోరుతూ మే 9న బిహార్​ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ విచారణను హైకోర్టు జులై 3కు వాయిదా వేసింది.