అవినీతి లేకుండా 71 వేల మందికి ఉద్యోగాలు

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన దాదాపు 71వేల మందికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేశారు.  రోజ్‌గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ మేళాలో పాల్గొన్నాయి.
 
అపాయింట్‌మెంట్ లెటర్‌ పొందినవారు గ్రామీణ డాక్ సేవకులు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోస్ట్‌లు, కమర్షియల్-కమ్- టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్-కమ్ -టైపిస్ట్, జూనియర్ అకౌంట్స్ క్లర్క్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, లోయర్ డివిజన్ వంటి వివిధ పోస్టుల్లో చేరనున్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం కష్టంగా ఉండేదని, ఫారం పొందేందుకు గంటల తరబడి లైన్‌లో నిలబడాల్సి వచ్చేదని ప్రధాని మోదీ గుర్తు చేశారు.
కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేయడం సులభమైందని చెప్పారు. దరఖాస్తు చేసే దగ్గరి నుంచి  ఫలితాల వరకు అన్నీ  ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయని, కొన్ని ఉద్యోగాలకు  ఇంటర్వ్యూలు కూడా అవసరం లేదని పేర్కొన్నారు. గ్రూప్ సి అండ్ డి  పోస్టుల రిక్రూట్ మెంట్ లో   అవినీతి బంధుప్రీతి నిర్మూలించామని తెలిపారు.  
భారత ప్రభుత్వం యొక్క ప్రతి పథకం, ప్రతి విధానం యువతకు కొత్త ఉపాధి అవకాశాలను కల్పించడమే అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.  ఉద్యోగాల సృష్టికి ప్రధాని మోదీ   అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్రం తెలిపింది. దీనిలో భాగంగానే రోజ్‌గార్ మేళాను నిర్వహిస్తున్నట్లు చెప్పింది. రాబోయే రోజుల్లో మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ఇది దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు, మోదీ  2.9 లక్షల మందికి అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేశారని, తాజా కార్యక్రమంతో ఆ సంఖ్య 3.6 లక్షలకు చేరుకుందని వివరించింది.