డ్రోన్లతో పాక్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్.. ముగ్గురు అరెస్ట్

డ్రోన్లను ఉపయోగించి పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్‌ నుంచి డ్రగ్స్‌తో సంబంధం ఉన్న ముగ్గురు భారతీయులను ఢిల్లీ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అరెస్ట్ చేసింది. నిందితులు మల్కిత్ సింగ్, ధర్మేంద్ర సింగ్, హర్పాల్ సింగ్ పంజాబ్ కు చెందినవారు.

ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ నుంచి కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ స్పెషల్ సెల్ ముగ్గురిని అరెస్టు చేసింది. డ్రగ్స్ మాఫియా నుంచి పాకిస్తాన్ కు హవాలా నెట్‌వర్క్ ద్వారా బదిలీ అయిన డబ్బుకు బదులుగా నిందితులు పాకిస్తాన్ నుంచి డ్రోన్‌ల ద్వారా పంజాబ్, ఇతర రాష్ట్రాలలో డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారని విచారణ ద్వారా పోలీసులు వెల్లడించారు. 

పంజాబ్‌ నుంచి పరారైన ఈ ముగ్గురు డ్రగ్స్ సరఫరాదారులకు అమెరికా, ఫిలిప్పీన్స్‌లో సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లలో ఫిలిప్పీన్స్, అమెరికాకు చెందిన ఫోన్ నంబర్లు లభ్యమయ్యాయి. 

డ్రోన్‌ల ద్వారా పాకిస్తాన్ రవాణా చేసిన డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి సేకరించాలో వారికి సూచించడానికి వారి హ్యాండ్లర్లు ఈ నంబర్‌లను ఉపయోగించారు. నిందితులు 2010-2011 మధ్య పంజాబ్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు హెరాయిన్ సరఫరా చేసేవారని పోలీసులు తెలిపారు.