స్వర్ణ దేవాలయం సమీపంలో ఇంకోసారి పేలుళ్లు

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో వరుస పేలుళ్లు కలకం రేపుతున్నాయి. అమృత్‌సర్‌లోని చారిత్రక స్వర్ణ దేవాలయం సమీపంలో మూడోసారి భారీ పేలుడు  సంభవించింది. దీంతో ఆ ప్రాంతమంతా పేలుడు శబ్ధాలతో దద్దరిల్లింది.  గురువారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో స్వర్ణ దేవాలయానికి సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్‌లో ఈ పేలుడు సంభవించింది.
గత ఆరు రోజుల్లో ఇది మూడోసారి కావడం గమనార్హం. అయితే ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు రాష్ట్ర జీడీపీ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. పంజాబ్‌లో శాంతి భద్రతలు, సామరస్యతను కాపాడేందుకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే ఈ పేలుడు వెనుక వారి ఉద్దేశమని వెల్లడించారు.
ఘటనా స్థలంలో ఫోరెన్సిక్‌ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారని తెలిపారు. అర్ధరాత్రి సమయంలో పెద్ద శబ్ధం వినిపించిందని నగర పోలీసు కమిషనర్‌ నౌనిహాల్‌ సింగ్‌ చెప్పారు. భవనం సమీపంలో శిథిలాలను కనుగొన్నామని తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలోని గదిలో నిందితులుగా అనుమానిస్తున్న ఐదుగురిలో ముగ్గురు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. 
ఈ ముగ్గురిలో ఇద్దరు పురుషులు, ఒకరు మహిళగా పోలీసులు పేర్కొన్నారు. పేలుడుకు పొటాషియం క్లోరేట్ ను ఉపయోగించారని పోలీసులు చెప్పారు. ఈ నెల 6, 8 తేదీల్లో కూడా స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ నెల 8వ తేదీ పేలుడు తర్వాత ఈ ఘటనపై ఎన్ఐఏ విచారణ నిర్వహిస్తుంది. ఈనెల 6వ తేదీన జరిగిన పేలుడులో ఒకరు గాయపడ్డారు. పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.ఈ నెల 8వ తేదీన జరిగిన పేలుడులో మరో వ్యక్తి గాయపడ్డారు