భారత్ గగనతలంలో ప్రవేశించిన పాక్ విమానం

పాకిస్తాన్‌ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 777 విమానం భారత గగనతలంలోకి ప్రవేశించింది. 10 నిమిషాల పాటు 120కి.మీ మేర భారత గగనతలంలో ప్రయాణించిందని, ఈ విమానాన్ని నిశితంగా పరిశీలించినట్లు భారత వైమానిక దళం ప్రకటించింది.

భారీ వర్షం కారణంగా దారితప్పడంతో ఆ విమానం భారత్‌లోకి ప్రవేశించిందని తెలిపింది. మే 4న, పాకిస్తానీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌ బోయింగ్‌ 777 (పికె.-248) మస్కట్‌ నుంచి లాహోర్‌లోని అల్లామా ఇక్బాల్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది. ఆ విమానం ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్‌ను నిలిపివేయవలసి వచ్చింది.

అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు లాహోర్‌ విమానాశ్రయంలో ఆ విమానం ల్యాండ్‌ కావాల్సి ఉంది. అయితే లాహోర్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పైలట్‌ విమానాన్ని ల్యాండింగ్‌ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ విమానం ఎదుర్కొంటున్న పరిస్థితులపై ఢిల్లీ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ అప్రమత్తమైందని, ఆ ప్రాంతంలోని వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని బోయింగ్‌ను పక్కదారి పట్టించాలని అభ్యర్థనను ప్రాసెస్‌ చేసినట్లు తెలిసింది.

ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ సూచనలు మేరకు పైలట్‌, గో- అరౌండ్‌ విధానాన్ని ప్రారంభించాడు. లాహోర్‌ పరిసరాల్లో చక్కర్లు కొట్టాడు. వర్షం భారీగా కురుస్తుండడం, తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ ఉండడం వల్ల దారి తప్పి భారత్‌లోకి ప్రవేశించినట్లు తెలిసింది.

ఆ సమయంలో 13 వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానాన్ని 23వేల అడుగుల ఎత్తులోకి తీసుకెళ్లాడు. పంజాబ్‌లోని తరణ్‌ సాహిబ్‌, రసూల్‌పుర్‌ నగరం గుండా వివిధ ప్రాంతాల్లో ప్రయాణించిన ఆ విమానం కాసేపటికి తిరిగి పాకిస్థాన్‌లోని ముల్తాన్‌కు చేరుకుంది. మొత్తం భారత్‌ గగనతలంలో దాదాపు పది నిమిషాల పాటు చక్కర్లు కొట్టిన పాక్‌ విమానం.. 120 కిలోమీటర్ల మేర ప్రయాణించింది.