మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా ఎఫ్ఎం రేడియో సదుపాయం ఉండాలంటూ ఫోన్ తయారీదారులకు కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సమాచారం, ఎంటర్టెయిన్మెంట్ ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు ఇది అవసరమని వ్యాఖ్యానించింది.
అంతేకాకుండా, అత్యవసర పరిస్థితులు, విపత్తులు, ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ఎఫ్ఎం రేడియో సేవలు ఎంతో కీలకంగా మారతాయని పేర్కొంది. ఈ మేరకు ఐటీ మంత్రిత్వ శాఖ మొబైల్ తయారీదారుల సంఘాలైన ఇండియన్ సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్, మాన్యుఫాక్చర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి లిఖిత పూర్వక సూచనలు జారీ చేసింది.
గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించడంలో ఎఫ్ఎమ్ రేడియోలు కీలక పాత్ర పోషిస్తాయని కూడా పేర్కొంది. ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్లలో ఎఫ్ఎం రేడియో సదుపాయం లేకపోవడాన్ని తాము గుర్తించినట్టు ఐటీ మంత్రిత్వ శాఖ తన నోటీసుల్లో పేర్కొంది. ఇది పేద ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని తెలిపింది.
అత్యవసర పరిస్థితులు, ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు సంభవించినప్పుడు పేద ప్రజలు ప్రభుత్వ సమాచారం కోసం ఎఫ్ఎం రేడియోపైనే ఆధారపడతారని పేర్కొంది. స్మార్ట్ఫోన్లతో పాటూ స్టాండ్ ఎలోన్ రేడియోలు, కార్లలో రేడియో రిసీవర్లూ అవసరమని కూడా ఐటీ మంత్రిత్వ శాఖ తన నోటీసుల్లో స్పష్టం చేసింది…!!

More Stories
జైషే హ్యాండ్లర్ నుంచి బాంబు తయారీ వీడియోలు
కశ్మీర్ టైమ్స్ ఆఫీస్లో ఏకే-47 క్యాట్రిడ్జ్లు
ఎన్ఐఏ కస్టడీకి నలుగురు ఢిల్లీ పేలుడు కీలక నిందితులు