సిక్కుల పవిత్ర యాత్రా స్థలంగా ప్రసిద్ధిగాంచిన అమృత్‌సర్ లోని స్వర్ణ దేవాలయం సమీపంలో వరుస పేలుడు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్వర్ణ దేవాలయానికి సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్‌లో మొదటసారి బాంబు పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
కాగా, 24 గంటల వ్యవధిలో అదే ప్రాంతంలో తాజాగా మరో పేలుడు సంభవించింది. స్వర్ణ దేవాలయంకు వెళ్లే మార్గంలోని హెరిటేజ్ స్ట్రీట్ లో సోమవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. స్వర్ణ దేవాలయానికి వెళ్లే మార్గంలోని దర్బార్ సాహిబ్ వద్ద ఈ పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు.
పేలుడులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. సమాచారం అందిన వెంటనే సీనియర్ పోలీస్ అధికారులు, బాంబు స్క్యాడ్, ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.
కాగా, వరుస పెలుళ్లతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఒకే ప్రాంతంలో 24 గంటల వ్యవధిలో రెండు పేలుళ్లు జరగడంతో ఆ ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు వెల్లడించారు. పేలుడు ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోందని.. స్థానికులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

More Stories
మణిపూర్- మయన్మార్ సరిహద్దులో కంచె తొలగింపు!
భారత్ లో చైనా ఆన్లైన్ వీసా దరఖాస్తు వ్యవస్థ
ఛత్తీస్గఢ్లో 12 మంది మావోయిస్టులు లొంగుబాటు