పొంగులేటి, జూపల్లిలను బిజెపిలోకి ఆహ్వానించిన ఈటెల 

రాష్ట్ర బిజెపి చేరికల కమిటీ చైర్మన్, ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ నాయకత్వంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి,  మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి గురువారం ఖమ్మంలోని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో భేటి అయ్యారు. పొంగులేటి కార్యాలయానికి వచ్చిన ఈటల బృందానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన అనుచరగణం ఘనంగా స్వాగతం పలికారు.
 
ఆత్మీయ విందు భోజనం చేస్తూ రాష్ట్ర జిల్లా రాజకీయాలపై చర్చించారు. ఈ క్రమంలో బిజెపిలోకి రావాలని ఈటెల రాజేందర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద కార్యకర్తలు , నాయకులతో సందడి నెలకొంది. ఇప్పటికే పొంగులేటిని బీజేపీ చేరికల కమిటీ పలుమార్లు కలిసింది.
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, డిసిసిబి మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, డిసిసిబి డైరెక్టర్లు తుల్లూరు బ్రహ్మయ్య, మేకల మల్లి బాబు యాదవ్, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మార్క్ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా వెంకటేశ్వర్లు, క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కర్ణాటక ఎన్నికల అనంతరం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల సమక్షంలో పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరుతారని అంటున్నారు. ఇలా ఉండగా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లితో సహా మోడీ నాయకత్వాన్ని, బీజేపీ విధానాలు నచ్చి ఎవరొచ్చినా పార్టీలోకి ఆహ్వానిస్తామని కరీంనగర్ లో బీజేపీ రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.

 
పొంగులేటి 2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి టిక్కెట్‌పై ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. అయితే ఆయన తన అనుచరులతో కలిసి 2016 మేలో టిఆర్‌ఎస్ (ప్రస్తుతం బిఆర్‌ఎస్)లో చేరారు. అయితే 2019 ఎన్నికల్లో ఖమ్మం నుంచి ఆయనకు పార్టీ టిక్కెట్ నిరాకరించింది.