చంద్రబాబుకు భారీ షాక్ .. సిట్ పై `స్టే’ ఎత్తివేత

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బుధవారం సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు ఎత్తేసింది. ఈ కేసును మెరిట్ ప్రాతిపదికన విచారించి తుది నిర్ణయాన్ని వెలువరించాలని హైకోర్టుకు సుప్రీం సూచించింది.
 
తద్వారా చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై విచారణ కోసం సిట్ ఏర్పాటు చేయడం కరెక్టేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లయింది. జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ సిటి రవికుమార్‌ల ధర్మాసనం తీర్పును వెలువరించింది. గత ప్రభుత్వ విధాన నిర్ణయాలపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటును ఏపీ హైకోర్టులో టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా తదితరులు సవాల్ చేశారు.
 
అమరావతి భూకుంభకోణంతో పాటు ఇతర చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సిట్ ఏర్పాటు చేసింది. అలాగే మంత్రివర్గ ఉపసంఘం కూడా దర్యాప్తు నిర్వహించింది. దీని సిఫార్సుల ఆధారంగా సిట్ ఏర్పాటు చేసింది.  అయితే చంద్రబాబు దీనిపై హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. దీన్ని వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు విధాన పరమైన నిర్ణయాలతో పాటు భారీ ప్రాజెక్టుల్లో అక్రమాలపై విచారణ కోసం సిట్ ఏర్పాటు చేస్తూ వైసీపీ సర్కార్ గతంలో నిర్ణయం తీసుకుంది. ఇందులో అమరావతి, పోలవరంతో పాటు పలు కీలక ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.
వీటిలో అక్రమాలు జరిగాయని భావిస్తున్న వైసీపీ సర్కార్ వీటిపై సిట్ దర్యాప్తు జరిగితేనే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని వాదించింది. అలాగే వీటిపై సీబీఐతోనూ విచారణ జరిపించాలని నిర్ణయించింది. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కూడా పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీంకోర్టు కూడా ప్రాథమిక దశలోనే సిట్ విచారణపై స్టే విధిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని కూడా తప్పుబట్టింది.
అంత వేగంగా స్టే ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని గతంలోనే ప్రశ్నించింది. ఇవాళ దానికి అనుగుణంగానే తీర్పు కూడా ప్రకటించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తేయడంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దర్యాప్తుకు మార్గం సుగమమైంది. దీంతో ప్రభుత్వం ఇక సిట్ విచారణను పరుగులు పెట్టించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.