
ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చేసిన హామీలను నెరవేరిస్తే కర్ణాటక ఖజానా ఖాళీ కాగలదని మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికలను పురస్కరించుకుని ఆయన చిత్రదుర్గ బహిరంగ సభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ ఎన్నికల హామీలు అవాస్తవికమైనవని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అనేక గ్యారంటీ కార్డులు జారీచేసిందని, కానీ వాటిని అమలుచేస్తే అభివృద్ధి పనులు ఆగిపోతాయని ఆయన హెచ్చరించారు.
‘దీనికి తోడు వారు బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం అమలుచేసిన పనులను కూడా వారు ఆపేస్తారు’ అని ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వారంటీ ముగిసిపోయిందని, దాని గ్యారంటీలకు విలువలేదని ప్రధాని స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ ట్రాక్ రికార్డు సరైనది కాదు. గుజరాత్‌లో వారు 2012లో హామీలిచ్చారు. పేద ప్రజలకు మోడల్ ఇళ్లు ఇస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. కానీ ప్రజలు తామే కార్మికులకు కూలీ ఇవ్వాల్సి వచ్చింది. ఇదే యదార్థం’అని చెప్పుకొచ్చారు.
‘ కాంగ్రెస్, జెడిఎస్ వేర్వేరు పార్టీలుగా కనపడతాయి, కానీ వాటి భావజాలం ఒకటే అని ప్రధాని విమర్శించారు. చిత్రదుర్గలో కేంద్రం జాతీయ రహదారుల అమలు కోసం రూ. 3500 ఖర్చు పెట్టింది. తుమ్‌కూర్- చిత్రదుర్గ- దావణ్‌గేరె రైల్వే లైన్ పనులను మొదలుపెట్టింది’ అని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ ఉగ్రవాదుల పట్ల సంతృప్తికర విధానాలు ఆవలంభిస్తుందని అంటూ కర్ణాటకకు ఆ పార్టీ ఉగ్రవాదుల దయాదాక్షిణ్యాలపై వదిలివేస్తే, బిజెపి వారి వెన్నుముక విరిచిందని మోదీ స్పష్టం చేశారు. 2008లో ఢిల్లీలో బాటిలా హౌస్ ఎంకౌంటర్ లో పోలీసులు ఇద్దరు ఉగ్రవాదులను హతమారిస్తే వారి మరణాన్ని చూసి తనకు కన్నీరు వచ్చినట్లు నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంతాపం ప్రకటించారని ప్రధాని గుర్తు చేశారు.
మన భద్రతా దళాలు మెరుపు దాడులు జరిపి సరిహద్దు అవతల ఉగ్రవాదుల శిబిరాలను కూల్చివేస్తే, కాంగ్రెస్ నేతలు మన దళాల సామర్ధ్యాన్ని ప్రశ్నించారని మోదీ మండిపడ్డారు. భారత దేశ అభివృద్ధికి కీలక శక్తిగా కర్ణాటకకు తీర్చిదిద్దాలని కొంటున్నామని చెబుతున్నామని చెబుతూ అందుకోసం `డబల్ ఇంజిన్’ ప్రభుత్వం కోసం ఇక్కడ బిజెపిని తిరిగి గెలిపించాలని ప్రధాని కోరారు.
చిత్రదుర్గ ఏడు రౌండ్ల కోట (ఏళు సుత్తిన కోటె) అని చెబుతూ కేంద్రం కూడా దేశ ప్రజలకు ఏడు రక్షణ కోటలను ఇచ్చిందని, అవి 1.పిఎం ఆవాస్ యోజన, ఉచిత ఎల్‌పిజి సిలిండర్, మంచినీటి కనెక్షన్, 2. దారిద్య్ర రేఖ దిగువన(బిపిఎల్) ఉన్న కుటుంబాలకు రేషన్, 3. ఆయుష్మాన్ భారత్ యోజన, 4.జన్‌ధన్ బ్యాంక్,ముద్ర యోజన, 5.జీవన్ జ్యోతి, సురక్ష భీమ, అటల్ పింఛన్, 6.మహిళలకు భద్రత, 7. సామాజిక భద్రత అని ప్రధాని వివరించారు.
కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో వరాలు
అంతకు ముందు కాంగ్రెస్ విడుదల చేసిన కర్ణాటక ఎన్నికల ప్రణాళికలో గృహ జ్యోతి: 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు; గృహ లక్ష్మి: ఒక్కో కుటుంబ పెద్ద మహిళకు రూ. 2000; అన్న భాగ్య: 10 కిలోల ధాన్యం; యువ నిధి: నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ. 3000, నిరుద్యోగ డిప్లోమా హోల్డర్లకు నెలకు రూ. 1500; శక్తి స్కీమ్: కర్నాటక రాష్ట్రంలో కెఎస్‌ఆర్‌టిసి/బిఎంటిసి బస్సులలో మహిళలందరికీ ఉచిత ప్రయాణ వసతి హామీలను గుప్పించింది.
రిజర్వేషన్ పరిమితి(సీలింగ్)ని 50 శాతం నుంచి 75కు పెంచుతామని, ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, మైనారిటీ, లింగాయత్, ఒక్కలిగ వంటి ఇతర సముదాయాలకు రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించింది.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!