ఐక్యరాజ్య సమితిలో మన్ కీ బాత్ లైవ్

నేరుగా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేందుకు ప్రధాని నరేంద్ర  మోదీ ప్రారంభించిన మన్ కీ బాత్ 100 వ ఎపిసోడ్ ప్రత్యేకత సంతరించుకుంది. ఈ కార్యక్రమం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం లో లైవ్ టెలికాస్ట్ కానుంది.  ట్రస్టీషిప్ కౌన్సిల్ ఛాంబర్ లో ప్రత్యక్ష ప్రసారం కానున్నందున ఒక చారిత్రాత్మక క్షణానికి సిద్ధంగా ఉండండి  అంటూ ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత మిషన్ ట్వీట్ చేసింది.

ప్రతి నెల ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ పేరుతో రేడియో ప్రసంగం ద్వారా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతుంటారు. ఆదివారం దీనికి సంబంధించిన 100 వ ఎపిసోడ్ ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. అమెరికా కాలమాన ప్రకారం అక్కడ ఉదయం 1.30 గంటలకు న్యూయార్క్ లోని యూఎన్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో మిలియన్ల మంది పాల్గొనేందుకు మన్ కీ బాత్ స్పూర్తినిస్తుందని భారత మిషన్ పేర్కొంది. న్యూయార్క్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, కమ్యూనిటీ సంస్థలతో పాటు, న్యూజెర్సీలోని ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ సభ్యుల కోసం మన్ కీ బాత్  100వ ఎపిసోడ్ ప్రసారం జరుగుతోంది.

మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ప్రసారం కానున్న సందర్భంగా ప్రధాని మోదీకి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ శుభాకాంక్షలు తెలిపారు. ”దేశంలో పారిశుధ్యం, ఆరోగ్యం, మహిళల ఆర్థిక సాధికారత, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించిన అనేక అంశాలపై పనిచేయడానికి ప్రధాని మోడీ చేపట్టిన మన్ కీ బాత్ కార్యక్రమం వివిధ వర్గాలను ప్రేరేపించింది. 100వ మన్ కీ బాత్ ఎపిసోడ్​కు, ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు” అని బిల్ గేట్స్ ట్వీట్ చేశారు.

మరోవైపు 100వ ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌ ఎక్కువ మందికి  చేరువ చేసేలా బీజేపీ ప్రత్యేక సన్నాహాల్లో నిమగ్నమై ఉంది. ఇప్పటికే ఈ కార్యక్రమం ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్‌‌‌‌‌‌‌‌లు, కమ్యూనిటీ రేడియోలు, వివిధ టీవీ ఛానెల్‌‌‌‌‌‌‌‌లతో సహా  వెయ్యికి పైగా రేడియో స్టేషన్‌‌‌‌‌‌‌‌లలో ప్రసారం అయ్యేలా ఏర్పాట్లు చేశారు. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ సందర్భంగా స్టాంపు, నాణెం కూడా విడుదల చేశారు.

2014 అక్టోబర్ 3న ప్రధాని నరేంద్ర మోదీ  మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ నెట్వర్క్ ద్వారా తొలిసారిగా ప్రసారం చేశారు. 30 నిమిషాల నిడివిగల ఈ కార్యక్రమం 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30న ప్రసారం కానుంది.