రైళ్లల్లో ధూమపానం, మద్యం సేవిస్తే జరిమానా!

రైళ్లల్లో ధూమపానం, మద్యం సేవిస్తే జరిమానా!

ఇక నుంచి ప్రయాణికులు రాత్రివేళల్లో లైట్లు వేసి ఉంచకుండా, గట్టిగా మాట్లాడకుండా ఉండాలని రైల్వే శాఖ నిబంధనలను రూపొందించింది. తోటి ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పలు సూచనలను ఐఆర్‌సిటిసి జారీ చేసింది. రైలు అటెండర్లు, టిటిఈ, క్యాటరింగ్ సిబ్బంది, రైళ్లలో పనిచేసే ఇతర రైల్వే ఉద్యోగులకు సైతం ఈ నిబంధనలను వర్తించనున్నాయి.

నిబంధనల్లో భాగంగా ధూమపానం, మద్యం సేవిస్తే జరిమానా విధించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అదేవిధంగా ప్రయాణికులు పెద్దగా పాటలు పెట్టకూడదని, తమ సీట్లు, కంపార్ట్‌మెంట్‌లో, కోచ్‌ల్లో తోటి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యేలా మాట్లాడకూడదని, శబ్దాలు చేయకూడదని రైల్వే శాఖ ఈ నిబంధనల్లో పేర్కొంది.

ఇక రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణికులు లైట్లు వేయకూడదని, రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణికులను టికెట్లు చూపించమని టిటిఈ అడగకూడదని, గ్రూపులుగా ప్రయాణం చేసే వారు రాత్రి 10 గంటల తర్వాత బిగ్గరగా మాట్లాడకూడదని తాజా నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

మిడిల్ బెర్త్ ప్రయాణికులు తమ సీట్లు ఎప్పుడైనా తీసుకోవచ్చని, దీనికి సంబంధించి లోయర్ బెర్తులు ప్రయాణికులకు ఎలాంటి ఫిర్యాదు చేయొద్దని స్పష్టం చేసింది. రాత్రి 10 గంటల తర్వాత ఆహారం అందుబాటులో ఉండదని రైల్వే శాఖ తెలిపింది. అయితే, భోజనాన్ని ముందుగానే ఏర్పాటు చేసుకోవడానికి ఈ- కేటరింగ్ సేవలు పొందేలా అనుమతి ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది.

 ఎసి కోచ్‌లో ప్రయాణించే ప్రయాణికులు ఒక్కొక్కరూ 70 కిలోల వరకు, స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించే వారు 40 కిలోలు, సెకండ్ క్లాస్‌లో ప్రయాణించే వారికి 35 కిలోల వరకు లగేజీ ఉచితమని, స్లీపర్‌లో 80 కిలోలు, సెకండ్ క్లాస్‌లో 70 కిలోలతో పాటు అదనపు బ్యాగేజీ చార్జీలతో 150 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లవచ్చని ఐఆర్సీటిసి వివరించింది.