
30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుకు కారకులు కేసీఆర్ కుటుంబమేనని, ఆ కుటుంబ ప్రమేయంతోనే టీఎస్సీఎస్పీ పేపర్ లీక్ అయ్యిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా, పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేదాకా, నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేదాకా ఉద్యమాన్ని కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు.
పాలమూరులో బిజెపి ఆధ్వర్యంలో జరిగిన ‘నిరుద్యోగ మార్చ్’’ ర్యాలీలో పాల్గొంటూ కేసీఆర్ పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరిస్తూ ప్రజల భూములను, సొమ్మును దోచుకుంటున్నడని ధ్వజమెత్తారు. గ్యాంగ్ స్టర్లకే గ్యాంగ్ స్టర్ కేసీఆర్…అయినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నష్టపోయిన యువతకు న్యాయం జరిగే వరకు కొట్లాడతూనే ఉంటామని భరోసా ఇచ్చారు.
ఎవరి కోసం తెలంగాణ సాధించుకున్నం? కేసీఆర్ కుటుంబం కోసమా? అని ప్రశ్నించారు. 21 నోటిఫికేషన్లు ఇచ్చినా ఒక్కటీ సక్సెస్ చేయలేదని విమర్శించారు. కావాలనే తప్పులు చేస్తూ కావాలనే కోర్టుకు వెళ్లేలా చేస్తూ పరీక్షలు వాయిదా వేస్తున్నరని మండిపడ్డారు. పరీక్షలు కూడా నిర్వహించలేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత ఊడితే ఎంత? అని నిలదీశారు.
కేసీఆర్ కొడుకు ‘‘ఇద్దరు చేసిన తప్పిదమే పేపర్ లీకేజీకి కారణం’అన్నడని చెబుతూ మరి 50 మందిదాకా ఎందుకు అరెస్ట్ చేసినవ్? అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ పాలనలో శిథిలావస్థకు చేరిన ఉస్మానియా వర్శిటీని పునర్నిర్మిస్తాం… కాకతీయ వర్శిటీ భవనాలను నిర్మిస్తాం అని సంజయ్ హామీ ఇచ్చారు.
ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ ను ఏటా విడుదల చేస్తామని, పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని, ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామని, ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి రైతులను ఆదుకుంటామని వివరించారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు టి.ఆచారీ తదితరులు ప్రసంగించారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి