ఓంకారంపై కాషాయ రంగు తొలగించి, గులాబీ రంగు!

భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం సిద్దిపేట నగరంలోని 34వ వార్డులో గల విశ్వహిందూ పరిషత్ జండా రాడ్డుకు గులాబీ రంగు వేయించి టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం దుర్మార్గం అని  విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రముఖ్  పగుడాకుల బాలస్వామి
విమర్శించారు.
 
భారతీయ జనతా పార్టీపై మీకు ద్వేషం, కక్ష ఉంటే ఉండొచ్చు గాక.. కానీ ద్వేషాన్ని, ఆ పగను హిందుత్వంపై చూపడం దుర్మార్గ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పి విశ్వహిందూ పరిషత్ జెండా రాడ్డుకు తిరిగి భగవద్వజం ఎదురవేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేపట్టక తప్పదని హెచ్చరించారు.

కారు స్టీరింగ్ హైదరాబాద్ ఎంపీ చేతిలో ఉంది అంటే ఇదేనేమో అంటూ ఎద్దేవా చేశారు. కాషాయం జండాను.. హిందువుల పరమ పవిత్రమైన ఓం గుర్తును అపవిత్రం చేసే పనిలో టిఆర్ఎస్ పార్టీ నిమగ్నం అవ్వడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.

 
రాష్ట్ర మంత్రి హరీష్ రావు  ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నగరంలో కాషాయం జండా తొలగించి కాషాయం రంగు పై బిఆర్ఎస్ పార్టీ రంగు వేసి హిందుత్వాన్ని అవమానించడం కండకావరంగా అభివర్ణించారు. పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు దీనిపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపిచ్చారు.
 
మంత్రి తన బాధ్యతను మరింత పెంచుకోవాల్సింది పోయి, ఇంతటి నీచమైన వ్యవహారానికి దిగజారడం ఏమాత్రం తగదని హితవు చెప్పారు. హిందువుల మనోభావాలు గాయపరుస్తూ హిందువుల చిహ్నామైన ఓం కు ఘోరమైనటువంటి విధంగా అవమానించడం క్షమించరాని నేరం అని ధ్వజమెత్తారు.