కొలిక్కిరాని ఢిల్లీలో ఏపీ భవన్ విభజన

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చోటు చేసుకుని తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతున్నా ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన విషయంలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. తాజాగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ అంశంపై జరిగిన సమావేశంలోనూ మరోసారి ఇదే పరిస్థితి ఎదురైంది.

జనాభా నిష్పత్తిలో ఏపీ భవన్ విభజన జరగాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. 2018లో ఏపీ ప్రభుత్వం రెండు రకాల ప్రతిపాదనలను ఇటు తెలంగాణ ప్రభుత్వానికి, అటు కేంద్ర హోంశాఖకు అందజేసింది. ఇప్పటికే నిర్మించిన భవనాలను తెలంగాణకు కేటాయించే పక్షంలో ఖాళీ స్థలాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించేలా.. లేదంటే ఖాళీ స్థలాన్ని తెలంగాణకు కేటాయించిన పక్షంలో భవనాలున్న ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించేలా ప్రతిపాదనలున్నాయి.

ఈ లెక్కన మొత్తం 19.73 ఎకరాల స్థలంలో తెలంగాణకు 8.41 ఎకరాలు (41.68%) భూభాగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11.32 ఎకరాల (58.32%) స్థలాన్ని పంచాల్సి ఉంటుంది. విభజన చట్టంలోని సెక్షన్ 66 కూడా ఇదే విషయం చెబుతోంది. అయితే ఇందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించడం లేదు.

నిజాం ఆస్తి ‘హైదరాబాద్ హౌజ్‌’ను కేంద్ర ప్రభుత్వం తీసుకుని, అందుకు బదులుగా ఇచ్చిన స్థలంలో ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మించారని, నిజాం ఆస్తికి వారసత్వం తమకే ఉందని, ఆ ప్రకారం మొత్తం స్థలాన్ని తెలంగాణకే కేటాయించాలని వాదిస్తోంది. దీంతో ఏపీ భవన్ విభజన సాధ్యంకావడం లేదు. ఇక ఇదే అంశంపై మరో వారం తర్వాత సమావేశం కావాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది.

ఢిల్లీలోని ఏపీ భవన్ విలువ సుమారు లక్షన్నర కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ విభజన సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుడప్పుడు సమావేశాలను నిర్వహిస్తుంది. కానీ సమస్యని పరిష్కార దిశగా ఆసక్తి చూపట్లేదనేది స్పష్టమవుతోంది. దీంతో పాటు దేశ రాజధానిలో ఉన్న ఏపీ భవన్ విభజన అంశం కూడా పరిష్కారం కావట్లేదు. ఇదివరకు ఈ దీన్ని పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకున్నా అది సాధ్యపడలేదు. ఏపీ, కేంద్ర ప్రభుత్వాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ  తన సూచనలను చేయాల్సి ఉంటుంది.

ఆమోదయోగ్యంగా లేకపోతే కేంద్రమే ఈ సమస్యను పరిష్కరిస్తుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి రావొచ్చని సమాచారం అందుతుంది. మరోవంక,  ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో పొందుపరిచిన 91 సంస్థలు, షెడ్యూల్ 10 కింద చేర్చిన 142 ఇతర సంస్థల్లో అధికభాగం హైదరాబాద్‌లోనే ఉన్నాయని, వాటిని కూడా విభజించాలంటూ ఏపీ డిమాండ్ చేస్తోంది.