నిండు సభలో చీర లాగారని నెల్లూరు మేయర్ ఫిర్యాదు

నిండు సభలో చీర లాగారని నెల్లూరు మేయర్ ఫిర్యాదు

ఎస్టీ కులానికి చెందిన మహిళను అని కూడా లేకుండా కొందరు వైసీపీ కార్పొరేటర్ చీర లాగి అవమానకరంగా, అమానుషంగా తనతో ప్రవర్తించారంటూ పోలీసులకు నెల్లూరు మేయర్‌ పొట్లూరి స్రవంతి ఫిర్యాదు చేశారు. విలేకరుల సమావేశంలో స్రవంతి ఈ విషయమై కన్నీటిపర్యంతమయ్యారు. అయితే, ఫిర్యాదు తీసుకుని ఆమెకు రసీదు ఇవ్వడానికి పోలీసులు తొలుత సమ్మతించలేదు. రసీదు ఇస్తేనే పోలీ్‌సస్టేషన్‌ నుంచి కదులుతానని మేయర్‌ పట్టుబట్టారు. రెండు గంటలపాటు అక్కడే కూర్చున్నారు. దీంతో పోలీసులు దిగిరాక తప్పలేదు.

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైసీపీపై తిరుగుబాటు చేయగా, మేయర్‌ స్రవంతి, కొందరు కార్పొరేటర్లు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి మద్దతుగా నిలబడ్డారు. ఇది జరిగినప్పటి నుంచి ఆ ప్రభావం నెల్లూరు కౌన్సిల్‌ సమావేశంలో కనిపిస్తూనే ఉంది. సోమవారం నెల్లూరులో మేయర్‌ ఆధ్వర్యంలో నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం జరిగింది.

కౌన్సిల్‌ సమావేశం హాలు లో సీఎం జగన్‌ ఫొటోను ఏర్పాటు చేశారు. సమావేశం మొదలైన చాలాసేపటికి ఆ ఫొటోను మేయర్‌ గమనించారు.‘ఆ ఫొటో ఎవరు పెట్టారు?’ అని కమిషనర్‌ను అడిగారు. అంతే.. పలువురు కార్పొరేటర్లు ఒక్కసారిగా మేయర్‌ పోడియం వద్దకు దూసుకెళ్లారు.

వారి ముట్టడి నుంచి తప్పించుకొని తన చాంబర్‌కు వెళ్లడానికి ప్రయత్నించిన మేయర్‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. పోలీసులు అతి కష్టం మీద మేయర్‌ను బయటకు తీసుకొచ్చారు. అక్కడ విలేకరులతో మాట్లాడి, ఆమె సరాసరి నాలుగో టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌కు చేరుకున్నారు. కౌన్సిల్‌లో జరిగిన ఘటనపై ఆమె ఫిర్యాదు చేశారు.

‘‘కౌన్సిల్‌ సమావేశంలో సీఎం ఫొటో ఎవరు పెట్టారనే విషయం తెలుసుకోవాలనే ఉత్సుకతతో కమిషనర్‌ను అడిగాను. అంతేగానీ జగన్‌ ఫొటో పెట్టడానికి నేను వ్యతిరేకం కాదు. కానీ, దానిని తప్పుగా చిత్రీకరించి పథకం ప్రకారమే నాపై దాడి చేశారు” అని ఆమె తెలిపారు. “వారి దాడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. కార్పొరేటర్లు బొప్పల శ్రీనివాసులు, మూలె విజయ భాస్కర్‌రెడ్డిలు నా చీర పట్టుకుని లాగారు. మరో కార్పొరేటర్‌ మోయిళ్ల గౌరి నన్ను బలవంతంగా వెనక్కు నెట్టి దుర్భాషలాడారు’’ అని మీడియాకు స్రవంతి తెలిపారు.