మరోసారి తెరపైకి గవర్నర్ ప్రోటోకాల్ వివాదం

తెలంగాణాలో ప్రగతి భవన్ – రాజ్ భవన్ ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఆరు నెలలకు పైగా రాష్ట్ర శాసనసభ ఆమోదించిన పది బిల్లులకు గవర్నర్ డా. తమిళసై ఆమోదం తెలపగా పోవడంతో తీవ్రతరమైనది. అయితే ఈ విషయం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో, ప్రధాన న్యాయమూర్తి చాకచక్యంగా ఈ వివాదానికి ఓ ముగింపు పలక గలిగారు.
 
కానీ, ఈ ప్రతిష్టంభనకు కీలకమైన ప్రోటోకాల్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ నిబంధనల ప్రకారం పాటించాల్సిన ప్రోటోకాల్ అమలు చేయడంలేదని అంటూ మరోసారి గవర్నర్ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వైఖరిపై విమర్శలు గుప్పించారు.
 
రాజ్యాంగంలోని ఆర్టికల్ 167 ప్రకారం సీఎం, గవర్నర్ మధ్య తరచూ చర్చలు జరగాలని, కానీ తెలంగాణలో ఆ పరిస్థితిలేదని డా. తమిళసై విచారం వ్యక్తం చేశారు. అందుకు తాను కారణం కాదని పేర్కొంటూ పరోక్షంగా కేసీఆర్ పై నింద మోపారు. సీఎం, గవర్నర్ మధ్య సత్సంబంధాలు ఉండాలని, కానీ రెండేళ్లుగా సీఎం కేసీఆర్ తనకు కలవలేదని ఆమె గుర్తు చేశారు.
 
పైగా, ప్రోటోకాల్ పాటించడంలేదని, అధికారులు ఎవరూ తనను కలవడంలేదని ఆమె కొంతకాలంగా విమర్శిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో దేశంలోనే ఎత్తైన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బహిరంగంగా అసంతృప్తి ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు ఎలాంటి ఆహ్వానం లేదని చెబుతూ, ఆహ్వానం అంది ఉంటే, ఇలాంటి కార్యక్రమానికి తాను కచ్చితంగా హాజరవుతానని ఆమె తెలిపారు.
 
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన పరిణామాలతో ముగిసిపోయిందని భావించారు. కానీ పెండింగ్ బిల్లులపై తెలంగాణ ప్రభుత్వం అనూహ్యంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో గవర్నర్, ప్రభుత్వం మధ్య వివాదం ముగియలేదని స్పష్టమైంది.  బిల్లులపై ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంతో వివాదం మరింత ముదిరినట్లయింది. ఈ వివాదంపై గవర్నర్ అప్పట్లో స్పందిస్తూ దిల్లీకి వెళ్లే బదులు రాజ్ భవన్‌కు రావాల్సిందని సీఎస్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
కాగా, ఈ నెల 30న అద్భుతంగా పునర్నిర్మించిన రాష్ట్ర సచివాలయం `అంబెడ్కర్ భవన్’ ప్రారంభోత్సవం ఈ నెల 30న సీఎం కేసీఆర్ చేయనున్నారు. ఈ కార్యక్రమంకు కూడా గవర్నర్ కు ఆహ్వానం పంపే పరిస్థితులు కనిపించడం లేదు.