బిజెపి మంత్రికి మెగాస్టార్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మద్దతు

బిజెపి మంత్రికి మెగాస్టార్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మద్దతు
సామాజిక వర్గాల పరంగా తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తలోదారి అన్నట్లు వ్యవహరిస్తుంటారు. అయితే పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో, తెలుగు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న చిక్కబళ్లాపూర్  నియోజకవర్గంలో వారంతా కలిసి బీజేపీ  అభ్యర్థిగా తిరిగి పోటీ చేస్తున్న రాష్ట్ర  ఆరోగ్య మంత్రి సుధాకర్ కు మద్దతు ఇస్తున్నారు.
 
బహుశా, కర్ణాటకలో ఇంత బహిరంగంగా తెలుగు నటుల అభిమానులు మద్దతు ప్రకటించడం ఇక్కడే కావచ్చు.  అయితే, ఆయన ఈ ఇద్దరు ప్రముఖ నటుల సామాజిక వర్గంకు చెందిన వారు కాదు. ఈ నియోజకవర్గంలో గణనీయ శాఖలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ ఆయన పేరు వెనుక రెడ్డి అనే ట్యాగ్ లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
 
తాను రెడ్డి అని చెప్పుకోవడానికి డాక్టర్ సుధాకర్ పెద్దగా ఆసక్తి చూపించరని, ఆయన అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటారని ఆయన సన్నిహితులు అంటున్నారు. విశేషం ఏమిటంటే ఈ ఇద్దరు నటుల అభిమానులతో పాటు, దళితులు సహితం ఆయనకు పెద్ద సంఖ్యలో మద్దతు ఇస్తున్నారు.
 
దళిత సామాజిక వర్గానకి చెందిన ప్రోఫసర్ బి. క్రిష్ణప్ప స్థాపించిన దళిత సంఘర్షణ సమితి ( డీఎస్ఎస్) నాయకులు డాక్టర్ సుధాకర్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శనివారం విలేకరులతో మాట్లాడిన డీఎస్ఎస్ నాయకులు ప్రొఫెసర్ క్రిష్ణప్ప కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఒకే నాణానికి చెందిన రెండు ముఖాలు అని, ఆ రెండు పార్టీలు ఇంతకాలం దళితులను మోసం చేసి వారిని ఓట్ల కోసం వాడుకుంటున్నారని, ఆ రెండు పార్టీల నాయకులు చిక్కబళ్లాపురంలోని దళితులను నిలువునా మోసం చేశారని ఆరోపించారు.
 
కర్ణాటక మంత్రి డాక్టర్ సుధాకర్ టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు చాలా సన్నిహితుడు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు బెంగళూరు వచ్చినా ఆయనను మంత్రి డాక్టర్ సుధాకర్ రిసీవ్ చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ ఫ్రీరిలీజ్ ఈవెంట్ కూడా కర్ణాటకలోని చిక్కబళ్లాపురంలో నిర్వహించగా, ఆ కార్యక్రమం విజయవంతం కావడానికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయిన డాక్టర్ సుధాకర్ అన్ని విదాలుగా సహకరించారు.
 
కర్ణాటక మంత్రి డాక్టర్ సుధాకర్ జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడు కావడం విశేషం. అంతేకాకుండా చిక్కబళ్లాపురంలోని మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం నాయకులు కూడా మంత్రి డాక్టర్ సుధాకర్ తో గత రెండు దశాబ్దాలుగా చాలా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. మొత్తం మీద పలు సంఘాలు డాక్టర్ సుధాకర్ కు అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ప్రకటిస్తున్నారు.