తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వరంగల్ కాకతీయ వైద్య కళాశాల పీజీ విద్యార్థి ధరావత్ ప్రీతిది ఆత్మహత్యేనని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటించారు. ప్రీతి మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టంలో ఈ విషయం వెల్లడైందని శుక్రవారం వెల్లడించారు. వరంగల్ కేఎంసీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి 57 రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని, ఆమె మృతదేహానికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించామని, చివరికి పోస్టుమార్టం రిపోర్టులో ప్రీతి మృతికి ఫెంటానిల్ కారణమని తేలిందని ఆయన వివరించారు.
ఆమె శరీరంలో ఫెంటానిల్ అవశేషాలున్నాయని తెలిపారు. సీనియర్ విద్యార్థి మహ్మద్ సైఫ్ వేధించడం వల్లే ప్రీతి మానసికంగా ఆందోళన చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. ప్రీతి మృతి చెందిన రోజు ఆమె గదిలో వాడిన సిరంజి దొరికిందని, దానికి ఉపయోగించిన సూది మాత్రం లభించలేదని తెలిపారు. ఆ సూది దొరక్కపోవడం వల్లే కేసులో జాప్యం జరిగిందని చెప్పారు.
ముందుగా ఎఫ్‌ఐఆర్‌లో పొందుపర్చిన అన్ని సెక్షన్లూ నిందితుడు సైఫ్‌కి వర్తిస్తాయని స్పష్టం చేశారు. ప్రీతి మృతికి మహ్మద్ సైఫ్‌ను బాధ్యుడిగా చేస్తున్నట్లు తెలిపారు. సైఫ్‌పై ముందుగా పెట్టిన కేసుల్లో ఐపీసీ 306తో పాటు అట్రాసిటీ కేసులు కొనసాగిస్తామని చెప్పారు. డాక్టర్ సైఫ్ వేధించినట్లు ఆధారాలు ఉన్నాయని చెబుతూ అతనే ప్రధాన నిందితుడని వెల్లడించారు. త్వరలో కేసుకు సంబంధించి కోర్టులో చార్జిషీట్ వేస్తామన్నారు.
ఈ కేసు ఆదినుంచీ మిస్టరీగానే కొనసాగింది. పోస్టుమార్టం నివేదికలో జాప్యం జరగడంతో అనుమానాలు పెరిగిపోయాయి. ఆమెను హత్య చేశారనే ప్రచారం కూడా జరిగింది. తమ కూతురి శరీరంపై గాయాలు ఉన్నాయని తల్లిదండ్రులు చెప్పారు. ఫిబ్రవరి 26న ప్రీతి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది.

More Stories
స్థానిక ఎన్నికలపై హైకోర్టు కోసం ఎదురుచూపు!
తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు
హైదరాబాద్ శివార్లల్లో గోసంరక్షకులపై కాల్పులు: