అమర్త్యసేన్‌కు విశ్వభారతీ భూమి ఖాళీచేయమని నోటిస్

అమర్త్యసేన్‌కు విశ్వభారతీ భూమి ఖాళీచేయమని నోటిస్
15 రోజుల్లోగా భూమిని ఖాళీ చేయాలంటూ నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌కు విశ్వభారతీ మరోసారి  నోటీసులిచ్చింది. ప్రతిచీలోని 1.38 ఎకరాల్లోని అక్రమంగా ఆక్రమించుకున్న 13 డెసిమల్స్‌ (ఎకరం కన్నా తక్కువ) భూమిని మే 6లోగా ఖాళీ చేయాలంటూ జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది.  ఈ ఆదేశాలు జారీ అయిన 15 రోజుల లోపు లేదా 2023 మే 6 లోపు పేర్కొన్న ప్రాంగణాన్ని ఖాళీ చేయాల్సిందిగా అనధికార నివాసాల తొలగింపు చట్టం 1971లోని సెక్షన్‌ 5లోని సబ్‌ సెక్షన్‌ (1) కింద తమకు అందించబడిన అధికారాలను ఉపయోగించి అమర్త్యసేన్‌ను ఆదేశిస్తున్నానని నోటీసులో పేర్కొన్నారు.
 
‘మే 6లోగా లేక ఉత్తర్వు ప్రచురించిన ఏప్రిల్ 19 నుంచి 15 రోజుల్లోగా అనధికారిక పద్ధతిలో ఆక్రమించిన భూమి నుంచి ఖాళీ చేయాలి’ అని యూనివర్శిటీ పేర్కొంది. నిర్దేశించిన వ్యవధిలోగా ఈ ఆదేశాలను పాటించకపోయినట్లైతే బలగాలను వినియోగించి ఖాళీ చేయించాల్సి వుంటుందని పేర్కొన్నారు.
 
శాంతినికేతన్‌లోని సేన్‌ పూర్వీకులకు చెందిన 1.38 ఎకరాల భూమిలో 13 డెసిమల్స్‌ను అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ గత నెల విశ్వభారతీ ఆరోపించింది. ‘షెడ్యూల్డ్ ప్రాంగణంలో వాయువ్య దిక్కులో 50 అడుగులు x 111 అడుగుల దశాంశాల భూమిని ఆయన నుంచి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించాము’ అని కూడా నోటీసులో పేర్కొన్నారు.
 
నోబెల్ బహుమతి గ్రహీత శాంతినికేతన్‌లోని పూర్వీకుల ఇల్లు ‘ప్రతీచి’లో నివసిస్తున్న సేన్‌కు కొన్ని రోజుల క్రితం సెంట్రల్ యూనివర్శిటీ మరో నోటీసును జారీ చేసింది, ‘మిస్సివ్’పై స్పందించడానికి, అనధికార భూమి నుంచి ఖాళీ చేయడానికి, ఏప్రిల్ 19 వరకు సమయం ఇచ్చింది. ఖాళీ చేయకపోతే తగిన చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొంది.
 
ప్రస్తుతం అమెరికాలో ఉన్న అమర్త్యసేన్‌ జూన్‌లో శాంతినికేతన్‌కు రానున్నారు. ఈ నోటీసులకు వ్యతిరేకంగా చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.