అమృత్‌పాల్‌ భార్యను లండన్ పోకుండా అడ్డుకున్న పోలీసులు

ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ నేత అమృత్‌పాల్‌ సింగ్‌ భార్య కిరణ్‌దీప్‌ కౌర్‌ (28)ను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లండన్ కు వెళ్లేందుకు ప్రయత్నించగా  విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. బ్రిటన్‌ విమానం ఎక్కేందుకు గురువారం ఆమె అమృత్‌సర్‌ లోని శ్రీ గురు రామ్ దాస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లారు.

అయితే అప్పటికే లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేయడంతో ఇమిగ్రేషన్‌ అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే  కిరణ్‌దీప్‌ కౌర్‌ జర్నీ విషయం గురించి పంజాబ్ పోలీసులకు తెలియజేశారు. ఆమె ప్రయాణానికి అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. వారిస్ పంజాబ్ డీ సంస్థకు విదేశీ నిధులను సమకూర్చడంతో ఆమె కీలకపాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు.

ఈ క్రమంలోనే కిరణ్‌దీప్‌ కౌర్‌ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఖలీస్థాన్ వేర్పాటువాద ఉద్యమంలో అమృత్‌పాల్‌ సింగ్‌భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? అనే విషయాలపై కిరణ్‌దీప్‌ ను ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.  కిరణ్‌దీప్ కౌర్‌ బ్రిటిష్‌ పౌరురాలు. ఆమె పంజాబ్‌లో పుట్టినప్పటికీ తల్లిదండ్రులు బ్రిటన్‌లో స్థిరపడటంతో అక్కడ పెరిగింది. ఆమెకు సోషల్‌ మీడియా ద్వారా అమృత్‌పాల్‌ సింగ్‌తో పరిచయం ఏర్పడింది.

దీంతో గత ఏడాది ఫిబ్రవరిలో వారిద్దరికి పెళ్లి జరిగింది. నాటి నుంచి ఆమె పంజాబ్‌లోనే ఉంటున్నది. ఒక ఇంటర్వ్యూలో అమృత్‌పాల్‌ సింగ్‌ను ఆదర్శ భర్తగా కిరణ్‌దీప్ కౌర్‌ అభివర్ణించింది. ఆమెపై పంజాబ్‌లో కానీ, దేశంలో కానీ ఎలాంటి కేసులు లేవు. అమృత్‌పాల్ భార్య కిరణ్‌దీప్ కౌర్ యూకేలో ఉంటూ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌లో క్రియాశీలక సభ్యురాలిగా ఉన్నారు.

పరారీలో ఉన్న నిందితుల కుటుంబం, పరిచయస్తులను ప్రశ్నించే చట్టపరమైన ప్రక్రియ కింద కిరణ్‌దీప్ కౌర్‌ను ముందు జాగ్రత్త చర్యగా ఇమ్మిగ్రేషన్ అధికారులు, పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు మార్చిలో అమృతపాల్ సింగ్ కార్యకలాపాలకు విదేశీ నిధులు సమకూర్చిన ఆరోపణలపై కిరణ్‌దీప్ కౌర్‌ను జల్లుపూర్ ఖేడా గ్రామంలో ప్రశ్నించారు.

మార్చి 18న పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న అమృత్‌పాల్‌ సింగ్‌ ఇంకా పరారీలో ఉన్నాడు. ఆయన ఆచూకీ కోసం భదత్రా బలగాలు, పంజాబ్ పోలీసు ప్రత్యేక బృందాలు అన్ని చోట్ల గాలిస్తున్నాయి. వాహనాలు, వేషాలు మారుస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు.

అంతకుముందు అమృత్‌పాల్ పేరుతో ఓ వీడియో బయటికొచ్చింది. తాను దేశం నుంచి పారిపోలేదని, త్వరలోనే ప్రపంచం ముందుకు మళ్లీ వస్తానని ఆ వీడియో సందేశం. మరోవైపు అమృత్‌పాల్‌ సింగ్‌ అనుచరులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే అతడి సన్నిహితుడు పాపల్‌ప్రీత్‌ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరికొందరిని అస్సాంలోని జైలుకు తరలించారు.